గుర్గావ్ బాలుడి హత్య వెనుక "రేప్"

దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గుర్గావ్‌ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఏడేళ్ల చిన్నారి టాయ్‌లెట్‌లో శవమై తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్నారి అని కనికరం లేకుండా కత్తితో అత్యంత పాశవికంగా బాలుడి గొంతు కోసి చంపడం అందరిని కంటతడి పెట్టించింది. పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎటువంటి గొడవ జరిగిన దాఖలాలు లేవు..స్కూలు సిబ్బందిని ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్న సమాధానమే.. మరి హత్య ఎవరు చేసి ఉంటారు..ఇదే ఖాకీల మెదళ్లను తొలిచేసింది. దీంతో ఆ ప్రశ్నకు సమాధానాన్ని తమ కోణంలో వెతికారు. ఆ వెతుకులాటలో అసలు నేరస్థుడు ఇంటి దొంగే అని తేలింది. అతను ఎవరో కాదు ఆ స్కూల్‌లో గత ఎనిమిది నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తోన్న 42 ఏళ్ల అశోక్ కుమార్.

 

అతను చిన్నారిని ఎందుకు హత్య చేశాడో తెలుసా..? లైంగిక దాడిని ప్రతిఘటించాడని.. అవును మీరు వింటున్నది పచ్చినిజం. నిన్న హత్యకు గురైన చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్‌ని వాళ్ల నాన్న స్కూలు వద్ద దించివెళ్లాడు. అప్పుడే బస్ పార్క్ చేసి వస్తున్న అశోక్‌కు బాలుడు టాయ్‌లెట్ వద్ద ఒంటరిగా కనిపించడంతో..అతనిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు..బాలుడు తప్పించుకునేందుకు యత్నించడంతో చిన్నారిని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని..కత్తితో రెండుసార్లు పొడిచానని అశోక్ తెలిపాడు. అనంతరం కత్తిని కడిగి ఘటనాస్థలంలో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

 

అయితే స్కూలు యాజమాన్యం ఏదో నిజాన్ని కప్పిపుచ్చేందుకే డ్రైవర్‌ని బలిపశువును చేసిందని కొందరు వాదిస్తున్నారు. హత్య జరిగిన సంగతి చెప్పకుండా మీ అబ్బాయి ఆరోగ్యం సరిలేదని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పడం.. రక్తపు మరకల్ని మాయం చేసేందుకు యత్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ..ఈ ఘటనతో సభ్యసమాజంలో అమ్మాయిలకే కాదు..అబ్బాయిలకు రక్షణ లేకుండా పోయిందని తేటతెల్లమైంది. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు చాప కింద నీరులా భారతీయ సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నడిరోడ్డుపై నడవలేని పరిస్థితి రావడం ఖాయం.