వ్యాపారుల కొమ్ముకాస్తున్న పొగాకుబోర్డు
Published on: Mon Apr 2, 2012 7:43AM
గుంటూరు పొగాకు బోర్డు వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన పోగాకుబోర్డు అందుకు భిన్నంగా వ్యాపారుల సంక్షేమానికి కృషిచేస్తున్నాదనే విమర్శలు వస్తున్నాయి. గుంటూరు పోగాకుబోర్డు పరధిలో 774 కంపెనీలు రిజిష్టరై ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ వేలంలో పాల్గొంటే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. కానీ ఇవి ఒక సిండికేట్ గా మారాయి. ప్రస్తుతం కేవలం 10 కంపెనీలు మాత్రమే మార్కెట్ యార్డులో పొగాకును కొనుగోలు చేస్తున్నాయి. ఈ 10 కంపెనీలు కూడా తాము నిర్ణయించిన రేటుకే రైతులు తమకు పొగాకును విక్రయించాలని అంటున్నాయి. దీనిపై పొగాకు బోర్డుకు అనేక ఫిర్యాదులు వెళ్ళినా పెద్దగా ఫలితం లేకపోతుంది.
బోర్డు చైర్మన్, ఐఎస్ అధికారి అయిన కమలవర్థనరావు వ్యాపారులతో కుమ్ముక్కయ్యారని పొగాకు బోర్డు మాజీ సభ్యుడు, వర్జీనియా పొగాకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చుండూరి రంగారావు ఆరోపిస్తున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యతా బోర్డు అధికారులకు ఉన్నప్పటికీ వారు తమకేమీ పట్ట్టనట్లు వ్యవహరించడం మంచి పధ్ధతి కాదన్నారు. ప్రస్తుతం వ్యాపారులు కుమ్ముక్కై నాణ్యమైన పొగాకుకు కూడా సరైన ధరలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. నిజానికి ఒకవైపు రాష్ట్రంలో సిగరెట్ల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే ముడి పొగాకు ధరలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. పొగాకు పంటవల్ల ఏటా కేంద్రానికి రూ. 15వేల కోట్లు, రాష్ట్రానికి రూ. 14 వందల కోట్ల ఆదాయం లభిస్తుంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల సంక్షేమానికి, వారి హక్కులు కాపాడటానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. పొగాకు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నప్పుడు పొగాకు బోర్డు ట్రెడ్ వింగ్ రంగంలో దిగి పొగాకును కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అయితే బోర్డు దీనికి కూడా ఇష్టపడక పోవడంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ రేటుకే విక్రయించుకోవలసి వస్తోంది.


