TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గన్నవరం ఎయిరుపోర్టులోనే  లోకేష్ అరెస్ట్? గుంటూరు, కృష్ణ జిల్లా టీడీపీ నేతలపై పోలీసుల నిఘా..

Published on: Thu Sep 9, 2021 8:58AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనతో  విజయవాడలో టెన్షన్ నెలకొంది. గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు అందజేసేందుకు వెళ్లగా దానిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు. లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. 

నారా లోకేష్ ను విమానాశ్రయంలోనే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వంద మంది పోలీసు బలగాలను మోహరించారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నరసరావుపేటలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని జిల్లా పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్‌ను చూసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది. 

నారా లోకేష్ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబును గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నక్కా ఆనందబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉషారాణిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.గన్నవరంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే హక్క ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. రమ్య హత్య కేసును రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్‌ వర్థంతికి లేని కరోనా నిబంధనలు... బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా అని నిలదీశారు. అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే నారా లోకేష్‌ను అడ్డుకోవాలని చూడడం సరికాదని ధూళిపాళ్ళ అన్నారు. 

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా టీడీపీ వుంటే వైసీపీ పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అమల్లోలేని దిశా చట్టం మహిళలకు రక్షణగా ఉంటుందని వైసీపీ చెబుతుందని విమర్శించారు. దిశా చట్టంతో ఏ కేసులో నిందితుడికి శిక్ష వేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్‌ నరసరావుపేట వెళితే వైసీపీ బండారం బట్టబయలు అవుతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేసిన వైసీపీ...టీడీపీ నేతలపై మాత్రం పోలీసులను ఉపయోగిస్తుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు

లోకేశ్‌ పర్యటన నరసరావుపేటలో రాజకీయ హీట్‌ పెంచుతోంది. తెలుగుదేశం నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. నరసరావుపేటలో పార్టీ మనుగడ కోసం లోకేశ్‌ వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నరసరావుపేటలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. దిశచట్టంపై ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ అరవిందబాబు తదితర నేతలు తీవ్రంగా ఖండించారు.