TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్ ను అడ్డుకునేందుకు 1000 మంది పోలీసులు.. జగన్ రెడ్డికి ఎందుకంత భయం? 

Published on: Thu Sep 9, 2021 12:57PM

గుంటూరు జిల్లా నర్సారావుపేటలో టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటన హై టెన్షన్ పుట్టిస్తోంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. 

నారా లోకేష్ ను అడ్డుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే 150 మంది పోలీసులను మోహరించారు. నలుగురు ఏసీపీలు అక్కడే ఉన్నారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గన్నవరం నుంచి నరసరావుపేట వరకు 1000 మంది పోలీసులతో  పహారా పెట్టారు. నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ఓవరాక్షన్ పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నారు. జగన్ రెడ్డి... ఎందుకంత భయం అంటూ ప్రశ్నిస్తున్నారు. 

గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు అందజేసేందుకు వెళ్లగా దానిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు.  లోకేష్ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబును గృహ నిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నక్కా ఆనందబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉషారాణిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్నవరంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.