తెనాలిలో రంగా విగ్రహం ధ్వంసం
Published on: Sat Jan 28, 2012 10:12AM
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో వంగవీటి రంగా విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఎన్జి రంగా విగ్రహాన్ని కూడా దుండగులు దాడి చేశారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.విగ్రహాలు ధ్వంసమైన విషయాన్ని గ్రహించిన పోలీసులు వాటికి మరమ్మత్తులు చేయడానికి ప్రయత్నించారు. అయితే, విగ్రహాల ధ్వంసం బయటకు రాకుండా చూడడానికి వారు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ విషయం తెలుసుకున్న రంగా అభిమానులు భారీగా గుమికూడారు. భావోద్రేకంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే, విజయవాడలో వంగవీటి రంగా కుమారుడు, రాజకీయ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి విగ్రహానికి అభిమానులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
స్వార్థపరులు విగ్రహాలను ధ్వంసం చేశారని, అభిమానులు ఏ విధమైన ఆందోళనలకు దిగవద్దని వంగవీటి రాధాకృష్ణ సూచించారు. స్వార్థంతోనే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసునకోవాలని ఆయన కోరారు. కాగా, విగ్రహాలను ధ్వంసం చేసినవారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెనాలి డిఎస్పీ చెప్పారు.


