పవన్ కల్యాణ్ పై వాలంటీర్ల కేసు కొట్టివేత
Published on: Tue Nov 19, 2024 10:14AM

పవన్ కల్యాణ్ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. వాలంటీర్లు ఫిర్యాదు చేశారంటూ అధికారులపై ఒత్తిడి పెంచి మరీ కేసులు నమోదు అయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు అవన్నీ ఉత్తుత్తి కేసులేనని తేలిపోయింది. తామెవరం పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేయలేదంటూ వాలంటీర్లు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో న్యాయమూర్త ఆ కేసు కొట్టివేశారు. వాలంటీర్ల పేరుతో పోలీసులే ఫిర్యాదు రాసుకుని కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఆ ఫిర్యాదుపై వాలంటీర్లు ఎవరూ సంతకాలు చేయలేదని తేలింది.
వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడంతో అప్పటిలో వారి చేత ఇష్టానుసారంగా ప్రకటనలు ఇప్పించారు. పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేయించారు. ఇప్పుడు కేసు కోర్టు వద్దకు వచ్చేసరికి అప్పట్లో వాలంటీర్లమంటూ ఇష్టా రీతిగా మాట్లాడిన వారంతా ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. కోర్టులో పవన్ కల్యాణ్ పై తాము ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని కుండబద్దలు కొట్టారు. నమోదైన ఫర్యాదులపై ఉన్నది తమ సంతకం కాదని చెప్పారు. దీంతో పవన్ పై వాలంటీర్ల కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది.


