కోడెల మౌనానికి అర్ధం ఏమిటో?
Published on: Mon Mar 12, 2012 1:53PM
గుం
టూరు: గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మరో కొద్దివారాల్లో ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. గతంలో మాచర్ల నియోజకవర్గ టిడిపి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈసారి ఎందుకో మౌనంగా ఉంటున్నారు. మాచర్ల వ్యవహారాలను ఆయన పట్టించుకోవడం లేదు. ఆయనను మాచర్ల వ్యవహారంపై ఎవరైనా అడిగితే ఇదంతా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చూసుకుంటారు, మనకెందుకులే అన్నట్లుగా సమాధానం దాటవేస్తున్నారు. దీంతో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
కోడెల శివప్రసాదరావుకు ఈ నియోజకవర్గంలో ముఖ్య అనుచరగణం ఉంది. వీరంతా కొమ్మారెడ్డి చెలమారెడ్డి అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. కోడెల ఆశీస్సులు కూడా చెలమారెడ్డికే ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి భిన్నంగా ఉండటంతో కోడెల శివప్రసాదరావు మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. మాచర్ల టిక్కెట్ కోసం చెలమారెడ్డితోపాటు రిటైర్డ్ ఐజి చిరుమామిళ్ళ వెంకటనరసయ్య, నిమ్మగడ్డ శ్రీనివాస్, మండల రవి, జూలకంటి బ్రహ్మారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


