వాడిపోతున్న పొన్నూరు సంపెంగ రైతు
Published on: Mon Mar 5, 2012 1:27PM
గుం
టూరు జిల్లా: గుంటూరు జిల్లా పొన్నూరు సంపెంగ పూల సువాసనలతో గుభాళిస్తున్నా ఆ వాసనను వాటిని పండించే రైతు ఆస్వాదించలేకపోతున్నాడు. పొన్నూరు మండలంలోని అనేక ప్రాంతాల్లో రైతులు సంపెంగ సాగు చేస్తున్నారు. వేసవిలో పైర గాలికి సంపెంగపూలు విరగకాసి కిలోమీటరు దూరం వరకు సువాసనలు వెదజల్లుతాయి. ఫిబ్రవరి నుంచి కాపు ప్రారంభమై మే వరకు పూస్తాయి. ఇక్కడి నుంచి సంపెంగ పూలు ప్రతిరోజూ గుంటూరు, విజయవాడ, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాలకు వెళుతుంటాయి. బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ వీరాంజనేయస్వామి వార్లకు భక్తులు సంపెంగ పూలతో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే ఈ సంపెంగ తోటల అభివృద్ధికి ప్రభుత్వం ఉద్యానశాఖ అధికారుల ప్రోత్సాహం కరువైంది. దీంతో తోటలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పూర్తిగా తోటల పెంపకంపైనే తాము జీవనం సాగించలేమని రైతులు అంటున్నారు. సీజన్ లో ఒక్కో చెట్టుకు 100 పూలు మాత్రమే పూస్తాయని, వీటిని అమ్ముకోగా వచ్చే డబ్బులు తోటలకు ఆకుతడి పెట్టడానికి కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.


