జగన్ నిర్ణయాలు.. ఏపీకి శాపం, తెలంగాణకు వరం

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు 'ఏపీకి శాపం, తెలంగాణకు వరం' అవుతున్నాయా అంటే అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏపీ రాజధానిలో సింగపూర్ ప్రాజెక్టు రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం తీసుకొని పదిరోజులు కూడా తిరగ్గకుండానే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ కంపెనీలతో గత ప్రభుత్వం చేసుకున్న మరో వ్యాపారపరమైన ఒప్పందాల్ని రద్దు చేశారు. గల్ఫ్ దేశాలకు చెందిన లులు గ్రూప్‌కు గత సీఎం చంద్రబాబు విశాఖలో భూములు కేటాయించారు. అయితే తాజాగా ఆ భూముల్ని రద్దు చేసినట్లు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. దీంతో ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా లాలూ గ్రూప్ వెనక్కి తగ్గింది. 

ఈ మేరకు లులు గ్రూప్ డైరెక్టర్ అనంత్ రామ్ ప్రకటన కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం తమ సంస్థకు ఇచ్చిన భూమిని రద్దు చేసిందన్నారు. విశాఖను కన్వెన్షన్ అండ్ షాపింగ్ హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేసేందుకు.. రూ. 2200 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 7000 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని భావించామన్నారు. ప్రాజెక్ట్ రూపకల్పనకు ఇప్పటికే తమ సంస్థ భారీ ఖర్చులు కూడా చేసినప్పటికీ.. కొత్త ప్రభుత్వ నిర్ణయానికి మేము అంగీకరిస్తున్నామన్నారు. ఇకపై ఏపీలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టమన్నారు. మరోవైపు తెలంగాణ, తమిళనాడు,కేరళ, ఉత్తర్ ప్రదేశ్‌లో తమ సంస్థ పెట్టుబడులు పెడుతుందన్నారు డైరెక్టర్ అనంతరామ్.

జగన్ తీసుకుంటున్న ఈ ప్రాజెక్టు ఒప్పంద రద్దు నిర్ణయాలు తెలంగాణకు వరంలా మారాయి అంటున్నారు. అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంపై జగన్ సర్కార్ సానుకూలంగా లేకపోవడంతో.. సింగపూర్ కంపెనీలు హైదరాబాద్‌ పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో.. సింగపూర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు భేటీ అయ్యారు. పెట్టుబడులతో ముందుకు వచ్చిన కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

భారత్‌లో పెట్టుబడుల కోసం.. సింగపూర్ సంస్థలు.. భారీ ప్రణాళికలే వేసుకున్నాయి. వారి పెట్టుబడులను ఆకర్షించడంలో.. నాటి సీఎం చంద్రబాబు కృషి చేశారు. అయితే అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట‌ కోసం రంగంలోకి దిగే సమయంలో.. ప్రభుత్వం మారిపోయింది. అప్పటికీ సింగపూర్ సంస్థ ఆసక్తిగా ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం.. అమరావతి ఓ సామాజికవర్గం వారిదేనన్న అభిప్రాయంతో.. సింగపూర్ సంస్థతో ఒప్పందాలు కట్ చేసుకుంది. దీంతో ఇప్పుడు.. వారు అమరావతిలో పెట్టుబడుల కోసం సిద్ధం చేసుకున్న సొమ్మును.. తెలంగాణలో పెట్టుబడులుగా పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కార్యాచరణ ప్రారంభించారు. కేటీఆర్ కూడా వారికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అంటే.. ఏపీ ప్రభుత్వం వద్దనుకున్న సింగపూర్ పెట్టుబడులను.. తెలంగాణ మాత్రం రెడ్ కార్పెట్‌ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. లులు గ్రూప్ కూడా ఏపీ సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే అవకాశముందని అంటున్నారు.