గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి ‘సిట్’క్లీన్‌చిట్?
Published on: Fri Feb 10, 2012 10:32AM
అహ్మ
దాబాద్: గుజరాత్‌లో 2002లో జరిగిన మత ఘర్షణల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సంబంధం ఉందని చెప్పడానికి తగిన ఆధారాలు తమకు లభించలేదని ఈ అల్లర్లపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన తుది నివేదికలో క్లీన్‌చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిట్ తన నివేదికను సీలు వేసిన కవర్‌లో బుధవారం ఈ కేసును విచారిస్తున్న మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. కాగా, ‘ప్రపంచ చరిత్ర ఆత్మ విశ్వాసం కలిగిన కొంతమందికే చెందుతుంది’ అని నరేంద్ర మోడీ తన ట్విట్టర్‌లో ఈ పరిణామంపై వ్యాఖ్యానిస్తూ అన్నారు. ఇదే అల్లర్లలో 500కు పైగా ప్రార్థనా స్థలాల కట్టడాలను కాపాడడంలో విఫలమైనందుకు మోడీ ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు బుధవారం తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. 2002 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో అహ్మదాబాద్‌లోని గుల్బార్గ్ హౌసింగ్ సొసైటీపై అల్లరి మూకలు దాడి చేసి కాంగ్రెస్ మాజీ ఎంపి ఎహ్‌సాన్ జాఫ్రీ సహా 69 మందిని సజీవ దహనం చేసారు. తన భర్త మృతితో మోడీతో సహా 62 మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు సంబంధం ఉందని ఆరోపిస్తూ జాఫ్రీ భార్య అప్పటినుంచి అవిశ్రాంతంగా న్యాయపోరాటం చేస్తున్నారు. సహాయం కోసం తన భర్త పోలీసులకు, మోడీ కార్యాలయానికి అనేక సార్లు ఫోన్లు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని కూడా ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మోడీ లేదా జాఫ్రీ ఆరోపించిన 62 మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఏవీ లేవని సిట్ తన తుది నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


