ఇంతలోనే ఎంత మార్పు మోడీజీ... చుక్కలు చూపిస్తున్నారుగా..!

 

ఒకసారి.. ఓ నాలుగేళ్లు వెనక్కి వెళదాం. బీజీపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్నో ఏళ్ల నుండి యూపీఏ పాలనతో విసుగెత్తిపోయిన జనాలు కూడా బీజేపీని ఆహ్వానించారు. ఇక అప్పటి వరకూ చేతులు ముడుచుకొని నాయకులకు కూడా రెక్కలు వచ్చినట్టుయింది. ఇక మోడీ లాంటి వ్యక్తి ప్రధాని అయ్యే సరికి..దేశం స్థితిగతులు మారిపోతాయి. దేశానికి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. అనుకున్నట్టే  మొదట అంతా బాగానే ఉంది.  మోడీ తీసుకున్న నిర్ణయాలు అందరికీ బాగానే నచ్చాయి. దీంతో ఎక్కడ చూసినా నమో.. నమో అంటూ మోడీ జపం చేశారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకే పట్టం గట్టారు. ఓ రకంగా ఉత్తరాదిన మొత్తం బీజేపీదే హవా అని చెప్పొచ్చు. అయితే మొదట అంతా బాగానే ఉన్నా... ఆతరువాతే అసలు కథ మొదలైంది.

 

ఎందుకంటే.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ ఎన్నో కథనాలు వచ్చాయి. దానికి తోడు.. దళితులపై దాడులు.. అమానుషంగా కొట్టి చంపడం.. ఇవన్నీ బీజేపీ వల్లే జరుగుతున్నాయన్న ఆరోపణలు. దానికి కారణం. బీజేపీ హిందుత్వ పార్టీ కావడమే. ఈ క్రమంలోనే నోట్ల రద్దు... జీఎస్టీ వంటి చట్టాలు ముందుకు తెచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం. వెరసి బీజేపీపై ప్రజల్లో ఓ వ్యతిరేక భావం ఏర్పడింది . బీజేపీపై ఏర్పడింది అంటే మోడీపై కూడా ఏర్పడినట్టే లేక్క కదా. ఇప్పుడు ఈ ప్రభావాలే గుజరాత్ ఎన్నికలపై కూడా పడ్డాయి. మనకేముందిలే ఇప్పటివరకూ అన్ని ఎన్నికల్లో గెలిచాం.. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం అని అనుకున్న బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్.

 

ఒకప్పుడు వీరిద్దరినీ బీజేపీ కౌంట్ కూడా చేసుకునేది కాదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని అయితే పిచ్చ లైట్ తీసుకునేవారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఈ మధ్య రాహుల్ కూడా మాటలు నేర్చుకున్నాడు. తన పంథా మార్చుకున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టు.. వారి మీద వీరి మీద కాకుండా.. ఏకంగా మోడీపైనే తన మాటల తూటాలు పేల్చాడు. మోడీనే టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా.. గట్టిగానే ఎన్నో ట్వీట్లు చేశాడు. నిన్న మొన్నటివరకూ రాహుల్ ను పప్పు అని చెప్పుకున్నవాళ్లే ఇప్పుడు మోడీ కి చెమటలు పట్టిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక హార్దిక్ పటేల్ విషయానికొస్తే..  మోడీ ముందు పిల్లకాకి అని చెప్పుకోవడం కూడా ఎక్కువే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ కు ప్రజల మద్దతు చాలా పెరిగింది. ఇటీవల పీఎం, సీఎం పాల్గొన్న సభకు జనాన్ని తోలడానికి బీజేపీ బాగా కష్టపడింది.  కానీ అంతకు ముందు వారం హార్దిక్ పటేల్ సభకు సొంతంగా తరలివచ్చిన జనమే ఎక్కువ. ఇక మోడీ అమోద్ సభలో కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తే సూరత్ లో 25 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత కూడా హార్దిక్ పటేల్ బహిరంగసభకు జనం పోటెత్తారు. దీంతో ఇప్పుడు బీజేపీ గెలుపుపై వారికే అనుమానం మొదలైంది. తాను రాజకీయంగా బలపడి.. గుజరాత్ అంటే మోడీనే అన్న పేరున్న మోడీకి కూడా ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందంటున్నారు. మొత్తానికి పిల్ల కాకులే కదా అని అనుకొని లైట్ తీసుకున్నారు..  ఇప్పుడు ఆ పిల్ల కాకులే మోడీకి చుక్కలు చూపిస్తున్నారు. మరి చూద్దాం ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో..