గెలిచినా కిక్ లేదు.. మోడీకి గుణపాఠమే..

 

ఒకసారి కాదు.. రెండోసారి కాదు.. ఏకంగా ఆరోసారి గుజరాత్ లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. అయితే ఇక్కడ ఓ చిన్న తేడా ఉంది. గతంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి...ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీకి తేడా ఉంది. ఎందుకంటే.. అసలు ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా అని బీజేపీకే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక భావనే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా బాగానే ఉండేది. ఎక్కడ చూసినా నమో మోడీనే కనిపించేది. ఆతరువాత రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ నాలుగేళ్లలో మోడీ  తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనపై వ్యతిరేక భావాన్ని కలిగించాయి. పటేల్ రిజర్వేషన్ ఉద్యమం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, దళితులపై దాడి ఇవన్నీ మోడీకి ప్రతికూల అంశాలుగా నిలిచాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశాలనే ప్రజలముందు లేవనెత్తాయి. దీంతో బీజేపీ కూడా తమ గెలుపు మీద సందేహ పడ్డాయి. కానీ చాలా కష్టపడి అధికారం చేజిక్కించుకుంది.

 

ఏ మాటకి ఆ మాట కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా.. బీజేపీకి మాత్రం చెమటలు పట్టించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోడీకి తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెమటలు పెట్టించారు. ఎప్పుడూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించే మోడీ ఈసారి తానే కంగారుపడ్డారు. చచ్చి బతికినట్టు అన్న సామెత ప్రకారం.. ఎట్టకేలకు బీజేపీ అధికారాన్ని అయితే చేజిక్కించుకుంది కానీ.. మరి గెలిచిన తరువాత ఎలా ఉండాలి. ఫుల్ జోష్ లో ఉండాలి.. కానీ ఆ గెలువు వెలుగు మాత్రం ఎక్కడా కనిపించనట్టే తెలుస్తోంది. ఏదో గెలిచాం.. హమ్మయ్యా గట్టెక్కాం అని అనుకుంటున్నారు తప్పా.. ఆ కిక్ , జోష్ మాత్రం ఎక్కడా లేదు. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిందే. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఓ గుణపాఠం అనే చెప్పొచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి, మోదీకి ఒక వార్నింగ్ బెల్  లాంటిదే అని చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.