ఏం మాయ చేశాడో..

 

ఎంతో ఉత్కంఠగా గుజరాత్ ఎన్నికలు జరిగాయి...ఇప్పుడు అంతే ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల కౌంటింగ్ మాత్రం మునుపెన్నడూ లేని విధంగా..క్షణానికో రకంగా మారుతూ.. అందరికీ చెమటలు పట్టిస్తుంది. అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. నిమిషాలు గడిచే కొద్దీ ట్రెండింగ్ మారుతుండటంతో ఫలితం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. అయితే మొదట కాంగ్రెస్ కాస్త జోరు చూపించినా... ఒక్కసారిగా బీజేపీ పుంజుకొని కాంగ్రెస్ ను వెనక్కి నెట్టింది. ఓ రకంగా చూసుకుంటే ప్రస్తుతానికి.. గుజరాత్ లో బీజేపీనే ఆధిక్యంలో కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

 

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. బీజేపీ మాత్రం ఈసారి బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. గతంలో చాలా తేలికగా అధికారం చేపట్టిన బీజేపీకి.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చిందని చెప్పొచ్చు. బీజేపీ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవడంలో ఫలితం సాధించింది. తన సొంత గడ్డమీద.. ఎన్నో సీఎంగా అధికారం చేసిన మోడీనే.. ఈసారి గుతరాత్ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలవుతామనే భయంతో ఉన్నారన్న వార్తలు చాలానే విన్నాం. దీనికి కారణం బీజేపీపై ఉన్న వ్యతిరేకత..ఒకవైపు రాహుల్ గాంధీ, మరోవైపు హార్దిక్ పటేల్ ల పోటీ. గుజరాత్‌ అభివృద్ధిని భాజపా గాలికొదిలేసిందని, రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని, కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనితో పాటు పటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ వంటి అంశాలతో పాటు, కుల సంఘాల అండతో భాజపాను ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ అడుగులు వేసింది. ఇక హార్దిక్ పటేల్ కూడా గత కొంత కాలంగా పటిదార్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాడు. దీంతో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు బీజేపీకి ఓట్లు వేయడం కష్టం. అంతేకాదు.. ఓబీసీ రిజర్వేషన్ల కోసం అల్పేశ్‌ ఠాకూర్‌, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ జిగ్నేష్‌ మెవాని భాజపాకు సవాల్‌ విసిరారు. ఇక వీరందరినీ కలుపుకొని.. కాంగ్రెస్..ఎలాగైనా భాజపాను అధికారం నుంచి తప్పించాలని వీరితో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లింది. కానీ కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది. 

 

అలా అని బీజేపీ గెలవడం అంతా ఈజీగా ఏం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి కాంగ్రెస్ ఎక్కువ సీట్లే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్ని సీట్లను గెయిన్ అయ్యిందో స్పష్టత వస్తుంది. అలాగే ఓటింగ్ శాతంలో ఎంత మేరకు మెరుగయ్యిందో కూడా కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అధికారం అందకపోయినా.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం.. భవిష్యత్తులో పోరాడటానికి కొత్త శక్తిని సాధించడం.. అనేవి కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటను ఇచ్చే అంశాలు. బీజేపీ దశాబ్దాలుగా పాతుకుపోయిన రాష్ట్రంలో గెలవడం అంటే కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా గొప్ప ఏముంటుంది? అదే కనుక జరిగుంటే... కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చేది.

 

మొత్తానికి మోడీ ఏం మాయ చేశాడో తెలియదు కానీ...గుజరాత్ లో ఈసారి అధికారంలోకి రావడం కష్టమే అనుకున్నా..అదేం జరగలేదు. ఈ నాలుగేళ్లలో బీజేపీపై చాలా మంది వ్యతిరేక భావంతో ఉన్నారు. నోట్ల రద్దు విషయంలో కానీ, జీఎస్టీ విషయంలో కానీ, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులు, దేశంలో బీజేపీ వచ్చిన తరువాతే అసహనం పెరిగింది అని వార్తలు.. ఇలా చాలా విషయాల్లో బీజేపీకి వ్యతిరేకం ఏర్పడింది. కానీ అవన్నీ మోడీ ముందు పటాపంచలై పోయాయి. ప్రజలు మోడీకే పట్టం గట్టారు. మోడీ తన మార్క్ ను మరోసారి చూపించారు...