కోచింగ్ సెంటర్ లో 555 మంది విద్యార్థులు.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్
Published on: Tue May 25, 2021 12:42PM
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో రోజూ నాలుగువేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టడి కోసం చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినా కొంత మంది లాక్ డౌన్ రూల్స్ పాటించడం లేదు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. గుజరాత్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కోచింగ్ సెంటర్ లో 555 మంది విద్యార్థులు ఉండటం కలకలం రేపింది.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలోని జస్దాన్ లో ఈ ఘటన జరిగింది. జయసుఖ్ సంఖల్వాగా కోచింగ్ సెంటరుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలకు విరుద్ధంగా 555 మంది విద్యార్థులను ప్రాంగణంలో ఉన్నట్లు తేలింది. కోచింగ్ సెంటర్ లో వందలాది మంది విద్యార్థులు ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. మాస్కులు లేకుండానే , భౌతిక దూరం పాటించకుండానే స్టూడెంట్స్ క్లాసులు వింటున్నారు. జవహర్ నవోదయ విద్యాలయ, బాలచాడి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సంకల్వ కోచింగ్ సెంటర్-కమ్-హాస్టల్ నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ కోచింగ్ సెంటర్‌లో 9 నుంచి 10 ఏళ్ల వయసు గల విద్యార్థులు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా తరగతి గదుల్లో ఉన్నారని రాజ్ కోట్ ఎస్పీ బలరామ్ మీనా చెప్పారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన జయసుఖ్ పై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వెల్లడించారు. అనంతరం కోచింగ్ సెంటరులోని విద్యార్థులను.. వారి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్పీ పేర్కొన్నారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


