కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంస్థలపై రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులు
Published on: Mon Nov 14, 2022 10:42PM
ఇలా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిందో లేదో అలా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థపై రాష్ట్ర జీఎస్టీ దాడులు చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పది వేల పై చిలుకు ఓట్లతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తద్వారా మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి మళ్లీ మునుగోడు నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు 20మంది అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని సుశీ ఇన్ ఫ్రా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలించారు. సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కంపెనీ. ఇందులో జీఎస్టీ సిబ్బంది తనిఖీలు చేయడం కలకలం రేపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై జీఎస్టీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సుశీ ఇన్ ఫ్రాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో దృష్టి సారించిన అధికారులు.. సంస్థ నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, సుశీ అరుణాచల్ హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్‌మైన్స్ లిమిటెడ్ అనే మూడు కంపెనీల ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్‌లో ఉంది. సుశీ ఇన్‌ఫ్రా కంపెనీలో ఇద్దరు, అరుణాచల్ హైవేస్ లిమిటెడ్ కంపెనీలో నలుగురు, సుశీ చంద్ర గుప్త్ కోల్‌మైన్స్‌లో ముగ్గురు డైరెక్టర్ల నివాసాలలోనూ సోదాలు జరిపారు రాష్ట్ర జీఎస్టీ అధికారులు. ఈ తనిఖీల్లో అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసున్నారని చెబుతోంది.
ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల సమయంలో సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపించింది. 5 కోట్ల 22 లక్షల రూపాయలు మునుగోడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు, వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకుల ఖాతాల్లో ఈ సొమ్ము జమైనట్లు టీఆర్ఎస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవాలకు సంబంధించిన జాబితాను కూడా ఈసీకి ఇచ్చింది. దానిని పరిశీలించిన ఈసీ అధికారులు.. వాటిని సుశీ ఇన్‌ఫ్రా లావాదేవీలుగా తేల్చింది. ఈ నేపథ్యంలో సంస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.


