ఎన్నికల ముందు తాయిలాలు

పేద, మధ్య తరగతి ప్రజానీకానికి కాసింత ఊరట. గడచిన కొన్నాళ్లుగా ధరాఘాతంతో సతమతమవుతున్న సామాన్యులకు దొరికిన ఆలంబన. నోట్ల రద్దు... జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశంలో సామాన్యుల నడ్డి విరిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలు ప్రతి ఒక్కరికి శరాఘాతంగా మారాయి. దేశంలో ప్రతి ఒక్కరూ ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు అని పాడుకునే పరిస్థితే కనిపించింది. అయితే దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా కేంద్రం కాసింత తగ్గింది.

 

 

తాజాగా జరిగిన జిఎస్టీ మండలి సమావేశంలో 88 వస్తువులు, సేవలపై పది శాతం జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ముదావహం. జీఎస్టీ పుణ్యమాని సామాన్యులు, మధ్యతరగతి మానవులు దేశంలో బతకలేని స్థితి కల్పించారు. ప్రతి వస్తువుపైనా రాష్ట్రం విధించే పన్ను, కేంద్రం విధించే పన్నులతో సతమతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ పేరుతో తీసుకువచ్చిన సరికొత్త వడ్డింపు బతకలేని స్థితికి తీసుకువచ్చింది. పప్పులు... ఉప్పులు... కూరగాయలు... పాలు... దేవుడి విగ్రహాలు.... చీపుర్లు... చివరికు కూరలో కరివేపాకు అని ఇన్నాళ్లూ తీసి పారేసిన ఆ కరివేపాకుపై కూడా జీఎస్టీ అంటూ పన్నులు విధించడం దేశంలో విడ్డూరాల్లో విడ్డూరం. దీని వల్ల రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తమ ఖజానా నింపుకునే అవకాశం ఉంటుందేమో కాని సామాన్యులకు మాత్రం చుక్కలు చూపించినట్లే అయ్యింది. 

 

 

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. శనివారం నాడు కేంద్ర తాత్కాలిక ఆర్ధిక శాఖా మంత్రి పియూష్ గోయోల్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సామాన్యులకు ఓకింత ఊరట కలిగిందనే చెప్పాలి.   ఈ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 88 వస్తువులపై భారం తగ్గనుంది. ఈ వస్తువులన్నీ సామాన్యులు నిత్యం వినియోగించేవే. టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలపై కూడా ఇంతకు ముందు జీఎస్టీ పేరుతో పన్నుల బాదుడు ఉండేది. తాజా నిర్ణయాల కారణంగా వీటన్నింటిపై ఆ పన్నులు తగ్గుతాయి.

 

 

ఇది ప్రజలకు... ముఖ్యంగా మ‌హిళా లోకానికి ఆనందాన్ని పంచే విషయం. జీఎస్టీ కారణంగా దేశంలో సగటు రైతు నానా కష్టాలు పడుతున్నారు. నానాటికీ దేశంలో వ్యవసాయం తీసికట్టుగా మారుతోంది. వ్యవసాయాధారిత దేశంలో రైతులు పడుతున్న అగచాట్లు అంతా ఇంతా కాదు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇక్కడి జరిగినన్ని రైతు ఆత్మహత్యలు మరెక్కడా జరగలేదు. అతివ్రష్టి, అనావ్రష్టితో రైతుల జీవితాలు సతమతమవుతున్నాయి. పంట చేతికి రాక... వచ్చిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల తమ కుటుంబాలతో వలసలు పోయి కూలీ నాలీ చేసుకుంటున్నారు.

 

 

తాజాగా జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రైతులకు మేలు చేసేవిగా ఉన్నాయి. ఇది పూర్తిగా రైతుల జీవితాలను మారుస్తుందని చెప్పలేం కాని... కొంత మార్పు మాత్రం వస్తుంది. ఈ కీలక సమావేశంలో వ్యవసాయం, విద్య, ఫుడ్ ప్రాసెసింగ్, సామాజిక భద్రత వంటి సేవలపై మినహాయింపులు ఇవ్వడం శుభ పరిణామంగానే చూడాలి. మరో పది నెలల కాలంలో దేశంలో ఎన్నికలు రానున్నాయి. దీనికి ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా విషయంలో  కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నట్లు అయ్యింది. ఆ వేడి ముందు ముందు మరింత ఎక్కువవుతుందని, ప్రజలను ప్రసన్నం చేసుకుందుకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు కూడా ఇక జిమ్మిక్కులు చేయడం ప్రారంభిస్తాయి.

 

 

ధికారంలో ఉన్న వారు ధరలు తగ్గించడం.... కొత్త కొత్త ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టడం వంటివి ప్రారంభిస్తారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం తాము అధికారంలోకి వస్తే మరిన్ని చేస్తామంటూ వాగ్దానాలు గుప్పిస్తాయి.  ఏది ఏమైనా సామాన్యుడికి మాత్రం రానున్న కాలమంతా ఒకింత మంచిగానే ఉండేట్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల పాటు ఏలికలు తమ చేతలతో పెట్టిన ఇబ్బందులను ఏడాది పాటు నిలిపివేసి ప్రజలకు ఊరట కలిగించడం... మరో నాలుగేళ్ల పాటు వారిని కష్టాలు పాలు చేసేందుకే దేశ ప్రజలకు తెలుసు. అయినా అల్ప సంతోషులైన ప్రజలు రాజకీయ నాయకుల ఉచ్చులో పడడం షరా మామూలే.