ఇస్రో ప్రయోగించిన బాహుబలి… అది తీసుకురానున్న 10 గొప్ప మార్పులు!

 

ఇస్రో వరుస విజయాల్లో మరో ఘనవిజయం తాజాగా జరిపిన జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగం! భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలోనే ఇది అత్యంత విశేషం. ఎందుకంటే, జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ బాహుబలి కాబట్టి! భారీగా కనిపిస్తూ 13అంతస్థుల బిల్డింగ్ అంత ఎత్తు వుండే జీఎస్ఎల్వీ ఎంకే 111… 200ఏనుగుల బరువు వుంటుంది! ఇంత భారీ రాకెట్ ప్రయోగించటం ఇండియాకు ఇదే తొలిసారి! కాని, ఎంతో శ్రమ, ఖర్చు చేసి ఇస్రో చేసిన సరికొత్త ప్రయోగం, అందులో విజయం… ప్రాక్టికల్ గా తీసుకొచ్చే లాభాలేంటి? బోలెడు వున్నాయి…

 

1.     జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ ని నింగిలోకి ప్రయోగించటం భారత్ ఎప్పట్నుంచో ఆశయంగా పెట్టుకున్న అంతరిక్ష స్వావలంబనకి దారి తీస్తుంది. ప్రతీ ప్రయోగానికి పాశ్చాత్య దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి ఇండియా ఇప్పుడు ఎంతో ముందుకు వచ్చేసింది. అయితే, పూర్తిగా అంతరిక్ష రంగంలో మన సత్తా పై మనం సగర్వంగా నిలబడేందుకు ఇంకొన్ని అడ్డంకులు వున్నాయి. వాట్ని ఛేదించటమే బాహుబలి రాకెట్ లక్ష్యం!

 

2.     భూ కక్ష్యలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టేందుకు భారత్ ఎప్పట్నుంచో పీఎస్ఎల్వీ వాహక నౌకను వాడుతోంది. అంతకంటే అధునాతన టెక్నాలజీయే జీఎస్ఎల్వీ. దీని ద్వారా అంతకంతకూ బరువైన ఉపగ్రహాల్ని ఇస్రో లాంచ్ చేస్తూ వస్తోంది. మొన్నీ మధ్యే 104ఉపగ్రహాలు ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లింది జీఎస్ఎల్వీ ద్వారానే!

 

3.    జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రధాన విశేషం క్రయోజెనిక్ ఇంజన్. అంతరిక్ష రంగంలో బాగా అబివృద్ధి చెందిన దేశాల వద్ద మాత్రమే ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ వుంటూ వచ్చింది. దాన్ని రష్యా సాయంతో సంపాదించిన ఇండియా జీఎస్ఎల్వీ రాకెట్లలో ఉపయోగించింది. ఫలితంగా బరువైన ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లగలిగాయి.

 

4.    రష్యా అందించిన క్రయోజెనిక్ సాంకేతికత కారణంగా జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో పూర్తిగా భారతీయ టెక్నాలజీతో క్రయోజెనిక్ ఇంజన్ తయారీకి పూనుకుంది. దాని పలితమే … CE20 క్రయోజెనిక్ ఇంజన్! ఈ అత్యాధునిక శక్తివంతమైన ఇంజన్నే బహుబలి రాకెట్ లో వాడారు. అందుకే, అత్యంత భారీ రాకెట్ ను ఆకాశంలోకి ఫైర్ చేయగలిగారు!

 

5.    జీఎస్ఎల్వీ ఎంకే 111 లో CE20 క్రయోజెనిక్ ఇంజన్ వాడటం వల్ల మనం ఇక మీద ఆకాశంలోకి తీసుకెళ్లబోయే ఉపగ్రహాల బరువు గణనీయంగా పెంచుకోవచ్చు. 4వేల కేజీల వరకూ తూగే సాటిలైట్స్ ను జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చు. అయితే, ఇస్రో టార్గెట్ నాలుగు వేల కిలోలు మాత్రమే కాదు… 6టన్నుల ఉపగ్రహాల్ని కూడా గగనంలోకి ఎత్తుకుని పోవటమే మన సైంటిస్టుల టార్గెట్. అందుకు తగ్గట్టుగా ముందు ముందు క్రయోజెనిక్ ఇంజన్ల శక్తిని పెంచుతూపోనున్నారు! అంతిమంగా… రాబోయే కొన్ని సంవత్సరాలలోనే 15టన్నుల బరువైన లోడ్ ని కూడా వినువీధిలోకి తీసుకెళ్లగలుగుతారు!

 

6.    జీఎస్ఎల్వీ ఎంకే 111 రాకెట్ తో ఎంత ఎక్కువ బరువు అంతరిక్షంలోకి పంపగలిగితే అంతగా మానవ సహిత అంతరిక్ష యానాలకి మనం దగ్గరవుతాం. అందుకే, ఇస్రో జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగాన్ని భారతీయ వ్యోమగాముల తొలి అడుగుగా చెబుతోంది. ఇంకా సుదీర్ఘమైన ప్రయోగాల పరంపర జరగాల్సి వున్నప్పటికీ …. జీఎస్ఎల్వీ ఎంకే 111 బహుబలి రాకెట్ విజయవంతం గగనంలోకి మన ఎంట్రీగా చెప్పుకోవచ్చు!

 

7.    భారీ ఉపగ్రహాల్ని ప్రయోగించటం , వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లటం మాత్రమే కాదు… మరో మేలు కూడా జరగనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాత్రమే ఏకైక అంతరిక్ష కేంద్రం. భూమికి ఆవల గగనంలో ల్యాబోరేటరీ నిర్మించి అక్కడ ప్రయోగాలు చేస్తుంటారు అమెరికన్, ఈయూ శాస్త్రవేత్తలు. మన సునీతా విలియమ్స్ లాంటి వ్యోమగాములు వుండి వచ్చింది ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లోనే!

 

8.    జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగం విజయవంతం… దీర్ఘ కాలంలో భారత్ కూడా అంతరిక్ష ప్రయోగశాల నిర్మాణానికి పూనుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. చైనా ఆల్రెడీ అంతరిక్ష ల్యాబోరేటరీలు నిర్మించాలనీ, తరువాత అంతరిక్ష కేంద్రం నిర్మించాలని తహతహలాడుతోంది. మన తాజా బహుబలి విజయం చైనాతో పోటిలో వుండేలా చూడగలదు. సమీప భవిష్యత్తులోనే మన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు రోజులు, నెలల తరబడి భూమికి బయట మకాం వేయగలరు. మానవ చరిత్ర మలుపు తిప్పే ప్రయోగాలు చేసి ఫలితాలు సాధించగలరు!

 

9.    వేల కిలోల బరువును మోసుకుపోగలిగే జీఎస్ఎల్వీ ఎంకే 111 ఇప్పుడు మన గ్యారేజ్ లో రెడీగా పార్క్ చేసి వుంది కాబట్టి… ముందు ముందు చంద్రయానం, మంగళయానం, గురు గ్రహ యానం, శుక్రయానం కూడా చేయవచ్చు. భూమిపైనే కాదు… మొత్తం సౌర కుటుంబంలో మన సత్తా చాటవచ్చు!

 

10.  జీఎస్ఎల్వీ ఎంకే 111 ప్రయోగానికి అన్నీ వైజ్ఞానిక లాభాలే కాదు… ఆర్దిక లాభసాటి కోణం కూడా ఒకటుంది! రానున్న కాలంలో అంతరిక్ష పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందని బడా బడా వ్యాపారవేత్తలు భావిస్తున్నారు! ఇప్పుడు వివిధ దేశాలు తిరిగి వస్తున్నట్టు అప్పుడు డబ్బున్న వారు, సరదా వున్న వారు భూమి బయటకి వెళ్లి అంతరిక్ష పర్యటన చేసి వస్తారట. అదే జరిగితే… అలాంటి పర్యాటకుల్ని గగన విహారానికి తీసుకెళ్లే బిజినెస్ ఆఫర్లు కూడా ఇస్రో కూడా దక్కుతాయి. ఇది డాలర్ల పంట పండించే అంశం!