TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాబోయే అల్లుడికి 365 వంటకాలతో విందు.. ఈ గోదారోళ్లు ఉన్నారే...

Published on: Sun Jan 16, 2022 3:07PM

భోజ‌న‌మంటే ఏముంటుంది? అన్నం, రెండు మూడు కూర‌లు, సాంబార్‌, పెరుగు, స్పీట్‌. అంతేగా. పోనీ, పండ‌గ స్పెష‌ల్ అనుకుంటే.. మ‌రో నాలుగైదు వెరైటీలు అద‌నం. ఎంత‌కాద‌న్నా.. 20-25 ఐట‌మ్స్‌కు మించి ఉండ‌వు. కానీ, గోదారోళ్లు ఆతిథ్యం అలా ఆషామాషీగా ఉండ‌దుగా. అస‌లే సంక్రాంతి. కాబోయే అల్లుడు ఇంటికొచ్చె. ఇక ఆ వంట‌కాలు మామూలుగా ఉంటాయా చెప్పండి. విందు భోజ‌నంతో వెర్రెత్తించింది ఓ కుటుంబం. 

పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ కుటుంబం తమ ఇంటికి కాబోయే అల్లుడికి 365 రకాల పిండివంటలతో ఆతిథ్యమిచ్చింది. అన్నం, పులిహోర, బిర్యానీ, దద్యోజ‌నం వంటి వంటకాలతో పాటు.. 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల కారం ఐట‌మ్స్‌, 15 రకాల ఐస్ క్రీమ్‌లు, 35 రకాల శీతల పానీయాలు, 15 రకాల కేకులతో.. భోజనం పెట్టారు. ఆ డైనింగ్‌ టేబుల్ మొత్తం వివిధ ర‌కాల వంట‌ల‌తో నిండిపోయింది. చూస్తేనే క‌డుపు నిండిపోయేలా ఉంది ఆ సెట‌ప్‌. అవ‌న్నీ తినాలంటే.. ఆ కాబోయే అల్లుడికి రెండు మూడు రోజులైనా ప‌డుతుందేమో.

ఏడాదికి 365 రోజులకు సింబాలిక్‌గా.. 365 ర‌కాల ఫుడ్ ఐట‌మ్స్‌తో విందు భోజ‌నం పెట్టిన‌ ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాబోయే అల్లుడికి పెట్టిన విందు భోజ‌నం వీడియోపై ర‌క‌ర‌కాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ‌ర్యాద‌లంటే గోదారోళ్ల‌వే అంటూ కొంద‌రు.. అవ‌న్నీ తిన‌గ‌ల‌వా బ్రో అంటూ మ‌రికొంద‌రు.. మీ ఓవ‌రాక్ష‌న్ పాడుగానూ అని ఇంకొంద‌రూ.. ఇలా నెటిజ‌న్లు ఆ విందు భోజ‌నం వీడియోకు ఫిదా అవుతున్నారు. మేము కూడా గోదావ‌రి జిల్లాల‌కు అల్లుడిమి కాక‌పోతిమి అంటూ ఉసూరుమంటున్నారు చాలామంది. ఎంతైనా గోదారోళ్లా మ‌జాకా...