బామ్మ మాట మర్డర్‌కి బాట!

 

మామూలుగా బామ్మ మాట బంగారు బాట అంటారు. అయితే ఒక యువకుడు బామ్మ మాటలని మర్డర్‌కి బాటగా మార్చుకున్నాడు. ఆ యువకుడి పేరు రాజా. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతంలో అతని నివాసం. ఎప్పుడో చనిపోయిన బామ్మకిచ్చిన మాటను నెరవేర్చడానికి ఆ యువకుడు తన బామ్మ శత్రువుని పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన లింగినేని సాంబశివరావు 1998లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సూర్యచంద్రరావు అనే వ్యక్తి నిందితుడు. ఈ కేసును రెండేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. సాంబశివరావు తల్లి వెంకటనరసమ్మ గుంటూరు జిల్లా లింగమనేనిపాలెంలో కొడుకు ఫొటోకు పూజలు చేస్తుండేది. సూర్యచంద్రరావును హత్య చేయాలన్న కోరికను తన బంధువుల దగ్గర ఎప్పుడూ చెబుతూ వుండేది. తన కొడుకుని చంపినవారిని ముక్కలు ముక్కలుగా నరకాలని చెబుతుండేది. ఆమెకు మనవడైన రాజా బామ్మ కోరికను తీర్చాలనుకున్నాడు. వెంకటనరసమ్మ 2011లో అనారోగ్యంతో మరణించింది. చనిపోయిన బామ్మ కోరిక తీర్చడం కోసం రాజా పకడ్బందీ ప్లాన్ వేశాడు. తాను టార్గెట్ చేసిన సూర్యచంద్రరావు గ్రామమైన శ్రీకుళానికి చెందిన యువతినే పెళ్ళి చేసుకుని ఆ ఊళ్ళోనే స్థిరపడ్డాడు. సూర్యచంద్రరావును చంపేందుకు అదును కోసం చూసీ చూసీ ఈనెల 22వ తేదీన శ్రీకాకుళంలోని వంగతోటకు నీరు పెట్టేందుకు వెళ్ళిన సూర్యచంద్రరావును హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే, సూర్యచంద్రరావుతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని, తన బామ్మ కోరికను తీర్చడం కోసమే అతన్ని చంపానని చెప్పాడు.