ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వెనుక జగన్ సన్నిహితుడు? ఆ మంత్రులకు కూడా లింకుందా?

 

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీచేసి దేశంలోనే రికార్డు సృష్టించామంటూ ఊదరగొడుతోన్న జగన్ ప్రభుత్వం... గ్రామ-వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుపై మాత్రం నోరు మెదపడం లేదు. బంధువులకు, వైసీపీ కార్యకర్తలకు పేపర్లను లీక్ చేసి, 18లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. పారదర్శకతే మా ప్రభుత్వ విధానం... అవినీతిరహిత పాలనే మా లక్ష్యమంటోన్న జగన్ ప్రభుత్వానికి ఇది మాయని మచ్చేనంటున్నారు నిరుద్యోగులు. కేవలం వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికే పరీక్షా పేపర్లను లీక్ చేశారని, ఒక్కో పోస్టును 5నుంచి 10లక్షలకు అమ్మేసుకున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే, గ్రామ-వార్డు సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకు వెనుక వైసీపీ సోషల్ మీడియా శ్రీధర్ రెడ్డి... అలాగే ఏపీపీఎస్సీ కార్యాలయ టైపిస్ట్ అనితారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డే సూత్రధారులుగా తెలుస్తోంది. అంతేకాదు శ్రీధర్ రెడ్డి... సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే మాట వినిపిస్తోంది. వైసీపీ విజయంలో తన పాత్ర ఎంతో ఉందని, తాను టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కష్టపడి పనిచేశారని, అందుకే తనకు లాభం చేకూరుస్తామని వైసీపీ పెద్దలు మాటిచ్చారని శ్రీధర్ రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వోద్యోగి అయిన తన భార్య బదిలీ కోసమంటూ ప్రతిరోజూ సెక్రటేరియట్ చుట్టూ చక్కర్లు కొట్టిన ఈ శ్రీధర్ రెడ్డి.... గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇఫ్పిస్తానంటూ కలెక్షన్ కౌంటర్ తెరిచాడని అంటున్నారు. అంతేకాదు మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి పేర్లు చెప్పి... కాంట్రాక్టర్లు, నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేపట్టినట్లు వైసీపీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. గ్రామ-వార్డు సచివాలయ అభ్యర్ధుల్లో ఒక్కొక్కరి నుంచి నాలుగు నుంచి ఐదు లక్షలు తీసుకున్నాడని అంటున్నారు. పరీక్షకు ముందు రెండు లక్షలు... సెలెక్టయ్యాక మిగతా డబ్బు ఇచ్చేలా బేరం కుదుర్చున్నాడట. అయితే ఇందులో తనకు మిగిలేది కేవలం లక్ష మాత్రమేనని, మంత్రికి రెండు లక్షలు, అధికారులకు లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంటుందని అభ్యర్ధులకు చెప్పినట్లు తెలుస్తోంది. 


అయితే, శ్రీధర్ రెడ్డి వసూళ్ల గురించి, తమ పేర్లు వాడుతున్నాడని తెలుసుకున్న మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి... అతనిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అంతేకాదు శ్రీధర్ రెడ్డిని అసలు తమ పేషీల దగ్గరకే అనుమతించొద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. ఇక తన భార్యను నంద్యాలకు బదిలీ చేయాలని మంత్రులకు ఎంత రిక్వెస్ట్ చేసినా, ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. అయితే, మంత్రులు దూరం పెట్టడంతో, ఏపీపీఎస్సీలో పనిచేసే తన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి భార్య అనితారెడ్డి ద్వారా గ్రామ-వార్డు సచివాలయ పరీక్షా పేపర్లను సంపాదించి, వాటిని తాను డబ్బు వసూలుచేసిన రెండు వందల మందికి అందజేసినట్లు పోలీసులు గుర్తించారట. అయితే, ఇప్పటికే శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.