జగన్ ఇచ్చిన స్వేఛ్చ...మంత్రులను అభాసుపాలు చేస్తోందా ?

 

ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో రకరకాల పరిణామాలు అటు ప్రజలకు, ఇటు నేతలకు రకరకాల షాక్ లు ఇస్తున్నాయి. ఎవరూ ఊహించనివారందరూ మంత్రులయ్యారు. అయితే అధికారులు మాత్రం అందరి మంత్రుల మాటా వినడం లేదనే వాదన వినిపిస్తోంది. పరిపాలన అంశాల్లో ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేస్తూనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ పూర్తిగా స్వేచ్ఛ నివ్వడంతో ఇప్పుడు ఎవరూ మంత్రులను లెక్కచేసే పరిస్థితుల్లో కనిపించడంలేదనేది ఇన్సైడ్ టాక్. 

అధికారుల తీరుతో కొంతమంది మంత్రులు అవమానాలే కాక అభాసుపాలవుతున్నారట. తాజాగా ఇటువంటి అనుభవమే ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎదురయ్యింది. ఆయనతో భేటీ అయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రతినిధి బృందం రాజధానికి వచ్చింది. ఈ బృందం రాష్ట్రంలో ప్రవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపిస్తామని ముందుకు వచ్చిందట. ఈ బృందం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్‌'తో సమావేశమైందని, తాము పెట్టబోయే సంస్థల గురించి, ఇతర విషయాల గురించి మంత్రితో ఆ బృందం చర్చించిందట. 

అయితే ఈ సమావేశానికి మానవ వనరులశాఖకు సంబంధించిన అధికారులు వస్తారని, రాష్ట్రంలో విద్యాపరిస్థితుల గురించి వారికి వివరిస్తారని మంత్రి భావించారట. కానీ ఈ సమావేశానికి సంబంధిత శాఖకు చెందిన సీనియర్‌ అధికారులెవరూ రాలేదట. సమావేశం ముగిసే వరకు మంత్రి సురేష్‌ వారి కోసం ఎదురు చూసినా వారెవరూ రాలేదని తెలుస్తోంది. దీంతో ఎజెండా ఏమిటి ? ప్రతినిధి బృందానికి ఏం చెప్పాలి అన్న విషయంలో మంత్రిగారికి క్లారిటీ మిస్ అయ్యింది. అసలు ఎందుకు వచ్చారో కనీస సమాచారం లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ ఆయన తన ఓఎస్డీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మంత్రి ఉన్నత విద్యావంతుడు కావడంతో సమయస్ఫూర్తితో వారితో మామూలుగా మాట్లాడి పంపించేశారు కానీ మరొకరు అయితే వారి ముందు అభాసుపాలయ్యేవారేనని అంటున్నారు.