భం భం భూం.. విశాఖలో రాజకీయ భూకంపం.. అందుకేనా..?
Published on: Wed Jun 23, 2021 11:59AM
కోర్టులు ఆగమన్నా సర్కారు ఆగట్లేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పాలకుల కన్నంతా భూముల మీదే ఉందంటున్నారు. ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి.. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి.. ఎక్కడెక్కడ టీడీపీ నేతల ఆస్తులున్నాయి.. ఇలా వీటి చుట్టూనే యంత్రాంగమంతా పని చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో భం భం భూం యవ్వారం జోరుగా సాగుతోందని అంటున్నారు.
విశాఖకు కేపిటల్ వచ్చేలోగా.. భూములంతా తమ గుప్పిట్లోకి వచ్చేలా ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు ఆరోపిస్తున్నారు. రాబోయే రాజధానిలో అంతా అధికార పార్టీదే హవా ఉండేలా.. ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకే, మొదట టీడీపీ నాయకుల ఆస్తులనే టార్గెట్ చేశారు. సబ్బం హరి మొదలు.. గీతం వర్సిటీ, పల్లా శ్రీనివాస్ వరకూ.. ఆక్రమణల పేరుతో తెల్లారేసరికల్లా భూకంపం సృష్టించారు. టీడీపీ నేతలనే కాదు.. మానసిక వికలాంగుల ఆశ్రమాన్నీ వదలకపోవడం దుర్మార్గం అంటున్నారు. భీమిలి రోడ్డులో చిరు వ్యాపారులనూ రోడ్డు పాలు చేసిన ఘనత జగన్‌రెడ్డి సర్కారుకే చెందుతుందనే విమర్శలున్నాయి. అంతా క్లియర్ అనుకున్నాక.. ఇక ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను పడిందంటున్నారు.
తమ వారికి భూపందేరం చేయాలంటే.. ముందుగా విశాఖలోని ప్రభుత్వ ఆస్తులన్నిటినీ ఓ గొడుగు కిందకు తీసుకురావాలనే ఎత్తుగడతో ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత అభివృద్ధి, పరిశ్రమలు, కంపెనీలు, సంస్థల పేరుతో తమకు కావలసిన వారికి దారదత్తం చేయొచ్చనేది వారి ప్లాన్‌లా ఉందంటున్నారు. ఇప్పుడు విశాఖలో అదే జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పేరుతో భూములను బంగారంగా మార్చేసి.. ఆ తర్వాత గంపగుత్తగా కొట్టేసేందుకు పావులు వేగంగా కదులుతున్నాయని అనుమానిస్తున్నారు. అయితే.. అక్రమమైనా సక్రమంగా చేసేలా.. చట్టబద్దంగా కనిపించేలా.. భూదందాకు తెరలేచిందని చెబుతున్నారు.
తాజాగా, ఏపీ అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఎస్‌డీసీ)కు నగర పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తుల బదలాయింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువను అనుసరించి ఆయా ఆస్తులకు ధరలను ఖరారు చేశారు. వీటి ఆధారంగా పంపిన బదలాయింపు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఆస్తుల సరిహద్దులు, సర్వే సంఖ్యలు, రెవెన్యూ దస్త్రాల్లో ఉన్న అంశాలను ప్రతిపాదనల్లో స్పష్టంగా పొందుపరిచారు. ప్రభుత్వానికి కలెక్టర్ పంపిన ప్రతిపాదనల్లో ఆస్తుల వివరాలు, నిర్ణయించిన ధరలు ఇలా ఉన్నాయి....
చినగదిలి మండల పరిధిలోని సర్వే సంఖ్య 126పి, 130పి పరిధిలో ఈవీఎంల గోదాముకు చెందిన 60 సెంట్లను బదలాయించనున్నారు. దీని విలువ రూ.29.04 కోట్లుగా యంత్రాంగం సిఫార్సు చేసింది. మార్కెట్ విలువ ఇక్కడ చదరపు అడుగు రూ.38వేలు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.90వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నట్లు యంత్రాంగం అంచనా వేసింది.
మహారాణిపేట మండల పరిధిలోని టౌన్ సర్వే సంఖ్య 183/1,183/2లో విద్యాశాఖకు చెందిన గ్రంథాలయ సంస్థ స్థలం 1.09 ఎకరాలు. దీని విలువ రూ.52.03 కోట్లుగా చూపారు. ఈ భూమిని సీఆర్‌పీఎఫ్ తన అవసరాల కోసం వినియోగిస్తోంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ విలువ ప్రకారం రూ.64వేలు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.90వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నట్లు అధికారులు అంచనా వేశారు.
మహారాణిపేట మండల పరిధిలోని వాల్తేరు వార్డులో అటవీశాఖకు చెందిన 2.08 ఎకరాల భూమిని బదలాయింపునకు ప్రతిపాదించారు. సర్వే సంఖ్య 88/ఎ11లో ఈ భూమి విస్తరించి ఉంది. రూ.100.67 కోట్లుగా దీని విలువను నిర్ధారించారు. ఈ సర్వే సంఖ్య 11.80 ఎకరాలు ఉండగా, అటవీశాఖ ఆధీనంలో 2.08 ఎకరాల్లో అటవీశాఖ అతిథి గృహం, క్వార్టర్లు ఉన్నాయి. మిగిలిన భూములు ఏయూ పరిధిలో ఉన్నాయి. మార్కెట్ విలువ ఇక్కడ చదరపు అడుగు రూ.61వేలు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.91వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతున్నట్టు లెక్కేశారు.
ఇలా, వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర ఖాళీగా ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ఏపీ అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఎస్‌డీసీ)కు దాఖలు పరుస్తున్నారు. ఇంకా కేపిటలే రాలేదు.. అప్పుడే భూముల లెక్కలు రెడీ చేస్తుండటం అనుమానాస్పదంగా మారిందంటూ విమర్శిస్తున్నాయి విపక్షాలు. ఇదంతా అభివృద్ధి కోసమేనా? లేక...?


