తెలంగాణలో అసలేం జరుగుతోంది? గవర్నర్‌ను ఆరా తీసిన మోడీ-అమిత్ షా.!

గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైనా, పోలీసుల దమనకాండపైనా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఫిర్యాదు చేసిన తర్వాతి రోజే... గవర్నర్ ఢిల్లీ వెళ్లడం... ఒకేరోజు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం... టీఆర్ఎస్ లో కూడా అలజడి సృష్టించింది. అయితే, ఆర్టీసీ సమ్మె... కార్మికుల ఆత్మహత్యలు... రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్న టైమ్ లో... కేంద్ర ప్రభుత్వాధినేతలను కలవడం ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోడీతో దాదాపు అరగంటపాటు సమావేశమైన తమిళిసై... తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన గవర్నర్.... ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, శాంతిభద్రతలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నివేదిక అందజేశారు. అయితే, ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో తెలంగాణలో అసలేం జరుగుతోందంటూ అమిత్ షా అడిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ తీరుతో.... తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోతోందని గవర్నర్ వివరించినట్లు సమాచారం అందుతోంది.

మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పోలీసుల దమనకాండపై ఆర్టీసీ కార్మికులు ఫిర్యాదుచేసిన తర్వాతి రోజే.... గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి... కేంద్ర పెద్దలను కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అంతేకాదు షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న గవర్నర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ, ముందుగానే తమిళిసైని ఢిల్లీకి రప్పించుకుని తెలంగాణలో పరిస్థితుల గురించి మోడీ-అమిత్ షా చర్చించడం సంచలనంగా మారింది.