రైల్లో భద్రాద్రికి.. రాములోరికి గవర్నర్ ప్రత్యేక పూజలు..
Published on: Mon Apr 11, 2022 6:18PM
చెప్పినట్టే చేశారు. రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి భద్రాచలం వెళ్లారు. భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యారు గవర్నర్ తమిళిసై. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు.
గవర్నర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఎప్పటిలానే ఈసారి కూడా ప్రోటోకాల్ పాటించలేదు ప్రభుత్వం. ప్రోటోకాల్ అధికారులు తమిళిసైకి స్వాగతం పలికేందుకు తరలిరాకపోవడం మళ్లీ వివాదాస్పదమవుతోంది.

ప్రభుత్వం పదే పదే తన ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తోందంటూ ఇటీవల ఢిల్లీలో మండిపడ్డారు తమిళిసై. ఆ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకూ ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా గౌరవించకున్నా పర్లేదు.. కనీసం గవర్నర్ హోదాను, రాజ్‌భవన్‌ను చూసైనా పద్దతి ప్రకారం నడుచుకోవాలని కాస్త ఘాటుగానే చెప్పారు. ఇక తానెక్కడికి వెళ్లినా రోడ్డు మార్గంలోనే వెళుతున్నానంటూ.. పరోక్షంగా మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగితే అరేంజ్ చేయకపోవడంపై సర్కారుపై విమర్శలు చేశారు తమిళిసై. భద్రాచలంకు సైతం రైలులోనే వెళ్తానంటూ ఆనాడే చెప్పారు. చెప్పినట్టుగానే.. రైల్లో ఫ్రత్యేక బోగిలో కొత్తగూడెం వరకూ వచ్చి.. అక్కడి నుంచి కారులో భద్రాద్రి వచ్చారు గవర్నర్. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు తమిళిసై.
ఇక, 14న తిరుపతి వెళ్లనున్నారు గవర్నర్ తమిళిసై. శ్రీ శక్తి పీఠం ఆధ్వర్యంలో జరగనున్న మహాకుంభాభిషేకం, బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
.webp)



