కేసీఆర్‌ కు షాకిచ్చిన గవర్నర్.. కొత్త మున్సిపల్ బిల్లుకు బ్రేక్!

 

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ షాకిచ్చారు. రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన కొత్త మున్సిపల్ చట్టం-2019 బిల్లుకు గవర్నర్ బ్రేక్ వేశారు. ఈ నెల 19న కొత్త మున్సిపల్ చట్టాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ దీనికి ఆమోదం పలికింది. అయితే ఈ బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన గవర్నర్, కొన్ని సవరణలు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం అధికారాలను ప్రభుత్వం ఆధీనపరుచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో గవర్నర్ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లులో కొన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడటంతో ప్రభుత్వం బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు సమాచారం. తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్రానికి పంపించనున్నారు. కేంద్రం ఆమోదం పొందితే ఈ బిల్లు అమలులోకి రానుంది.