అవినీతి, డ్రగ్స్‌పై కేంద్రానికి రిపోర్ట్.. కాకరేపుతున్న గవర్నర్ కామెంట్స్..
Published on: Thu Apr 7, 2022 4:54PM
గవర్నర్ తమిళిసై తగ్గేదేలే అంటున్నారు. సీఎం కేసీఆర్‌తో గ్యాప్ లేదంటూనే.. ఎంతెంత దూరమో చెప్పేస్తున్నారు. తనకు ఇగో లేదంటూనే.. ప్రోటోకాల్ పాటించరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంత దూరమైనా కారులోనే పోతున్నానంటూ ప్రభుత్వంపై రుసరుసలాడుతున్నారు. పనిలో పనిగా కేసీఆర్ సంగతి తేల్చేందుకే తాను ఢిల్లీ వచ్చినట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చేశారు.
హస్తినలో ప్రధాని మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్‌షాలను కలిసొచ్చాక.. గవర్నర్ తమిళిసైలో కాన్ఫిడెన్స్ సుస్పష్టంగా కనిపిస్తోంది. ఆమె వాయిస్‌లో సైతం పదును పెరిగింది. వరుసపెట్టి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారును ఏకి పారేస్తున్నారు. తనను ఎంతగా టార్గెట్ చేస్తున్నారో.. తనను ఎంతగా పక్కన పెట్టేశారో ఏకరువు పెడుతూ కేసీఆర్ ఇమేజ్‌ను ఢిల్లీ లెవెల్‌లో దారుణంగా డ్యామేజ్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఇదే పనిలో గవర్నర్ తమిళిసై ఫుల్ బిజీగా ఉన్నారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ.. పనిలో పనిగా ఢిల్లీకి తానెందుకు వచ్చారో వివరించారు.
తెలంగాణలో డ్రగ్స్ కేసు, రాష్ట్రంలో అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని చెప్పారు తమిళిసై. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని అన్నారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రదాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్నాయి.
అవినీతిపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానంటూ స్వయంగా గవర్నరే చెప్పడం సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ కుటుంబ అవినీతిపై బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి.. సీబీఐ, ఈడీ రైడ్స్ పక్కా.. కేసీఆర్ జైలు కెళ్లడం ఖాయమంటూ పదే పదే చెబుతున్నారు. ఇటీవల, కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఐటీ రైడ్స్ జరగడం.. అందులో కేసీఆర్-కేటీఆర్-కవిత-సంతోష్‌ల లింకులు బయటపడినట్టు ప్రచారం జరుగుతుండటంపై చర్చ నడుస్తోంది. మరోవైపు, డ్రగ్స్ ఎపిసోడ్ తెలంగాణను కుదిపేస్తోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్, పబ్స్ దందా వెనుక టీఆర్ఎస్ పెద్దలే హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. గవర్నర్ తమిళిసై నేరుగా ఢిల్లీ వెళ్లి.. మోదీకి, అమిత్‌షాకు డ్రగ్స్, అవినీతిపై నివేదిక ఇవ్వడం.. త్వరలోనే బిగ్ మూవ్ ఏదో ఉండనుందనే అనుమానం అయితే వస్తోంది. అది అదేనా? కేసీఆర్ అండ్ కో పై కేంద్రం యాక్షన్‌కి దిగబోతోందా? మహారాష్ట్రలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు.. కేసీఆర్‌ను టచ్ చేసే ముందుగా.. ఆ సన్నిహితుడిపై రైడ్స్ జరుగుతాయా? గవర్నర్ ఢిల్లీ పర్యటన అందుకు ముందస్తు సన్నాహమా?


