బదిలీల కత్తి పట్టిన ఉగ్ర నరసింహన్

 

ఉగ్ర నరసింహన్ తన కత్తికి పదును పెంచుతున్నారు. పాలనలో తనదైనా మార్కు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న పెట్రోలు బంకుల సమ్మెను గంటల వ్యవధిలోనే ఆపించిన ఆయన.. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో చేసిన నియామకాలు, బదిలీలపై దృష్టి పెట్టారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషేర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు.

 

కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు. కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓలో ఓఎస్డీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. ఆయనను ఏపీఐఐసీకి బదిలీ చేశారు. తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను గవర్నర్ మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్‌పీఎఫ్ డీజీగా బదిలీ చేశారు. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడుకు అప్పగించారు.