TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్

Published on: Tue Feb 21, 2012 3:41PM

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ట్విస్ట్ ఇచ్చారు. సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైలును నరసింహన్ తిప్పి పంపారు. అనుభవం లేని వారిని కమిషనర్లుగా నియమించారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ల నియామకాన్ని పున పరిశీలించాలని రాజ్ భవన్ ప్రభుత్వానికి సూచించింది. రాజకీయ నాయకులను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమించారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులను కమిషనర్లుగా నియమించడాన్ని గవర్నర్ తప్పు పట్టారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది మందితో కూడిన ఫైల్‌ను పంపించింది. అందులో నలుగురు పేర్లను గవర్నర్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కమిషనర్ల నియామకంలో అవకతవకలు ఉన్నాయని, రాజకీయ నాయకులకు అందులో చోటు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి అందిన సూచనల మేరకే గవర్నర్ ఈ ఫైలును తిరస్కరించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.