కళంకిత మంత్రులకు ప్రభుత్వ న్యాయ సహాయం ఎందుకు చేయాలి?
Published on: Mon Jul 9, 2012 12:32PM
స్వాతంత్య్రం వచ్చాక మొదటి తరం రాజకీయాలన్నా, నాయకులన్నా, మంత్రులన్నా ప్రజలకు గౌరవాభిమానాలు ఉండేవి. అందుకు కారణం వారు ప్రజలకు సేవచేయటానికే వచ్చారని నమ్మకం కలిగించటం. అందుకు నాయకులు, మంత్రులు పాటించిన నైతికతే నిదర్శనం. ఏదైనా ఒక ఆరోపణ వస్తే అదినిరూపించుకునే వరకు రాజీనామా చేసేవారు. అది వారి నిబద్దకు నిదర్శనం....అనంతరం ఎన్ని ఆరోపణలు, స్కాంలు, కుంభకోణాలు ఏమైనా సరే పదవికి ఏమీ అడ్డుకాదనే నాయకులు ముందుకొచ్చారు. ఇప్పుడు మోడరన్ తరం వచ్చింది. సరికొత్త సాంప్రదాయం తెరపైకి తెచ్చారు. అవినీతి ఆరోపణలు, సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు వారి పదవులకు ఏమీ అడ్డంకి కాదు. కావాలంటే న్యాయ సహాయం కూడా వారి వారి శాఖలనుండి ఖర్చుపెడతారు. ఎంత ఎదిగిపోయాం..... ఎదిగింది రాష్ట్ర ప్రజలు కాదు. రాష్ట్ర మంత్రి వర్గం . అదికూడా ఏ ఒకరికో ఇద్దరికో కాదు. ఏకంగా నలుగురు మంత్రి వర్యులకు. అందులో ఇద్దరికి ముందు లేదన్నా తరువాత వారికి కూడా అందిస్తామన్నారు. ఇంత దిగజారుడు తనం ఏ రాష్ట్రంలోనైనా వుందా .
ప్రజలు మాత్రం కరెంటులేని అంధకార రాష్ట్రంలో ఉండాల్సిందే. పంటలు వేయటానికి విత్తనాలు, ఎరువులు లేవు. బ్లాకులో తెచ్చివేసిన గింజలు మొలవవు. పోనీ మెట్ట పంటలు వేద్దామంటే వానలు పడవు. బోర్లుకింద పండిద్దామనుకుంటే కరెంటు లేదు.కాని బిల్లుల మోత మాత్రం పెరిగిపోతుంది....పరిశ్రమలది ఆదే దారి. పంటలు పండక రైతులు, చాలీ చాలని సదుపాయాలతో కాలేజీ చదువులు, తల్లిదండ్రులకు పెను భారం. స్కాలర్‌షిప్పుల ఊసేలేదు. రీఎంబర్స్‌మెంట్ వస్తుందోరాదో తెలియదు. బయటికి వెళితే ఇంటికి వస్తామో రాలదో తెలియదు. ఎందుకంటె రహదారులన్నీ రక్తసిక్తం. చేనేత పరిశ్రమ పడక వేసింది. పట్టించుకునేవారే కరువు. రోగం వస్తే సర్కారు ధవాఖానాలో డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉన్నా మందులుండవు.
కార్పొరేట్ ఆసుపత్రుల కెళితే ఆస్తులు అమ్ముకోవల్సిందే. పెరిగిన నిత్యావసర ధరలు చుక్కల్లో ఉన్నాయి అందుకోలేని సామాన్యడి అసహాయత ...ఇదేమీ ఇప్పటి పాలకులకు అవసరం లేని విషయాలు. వాటికి ఉన్నది ఒకటే ఎజెండా పదవి ఉందా లేదా ఎలా పదవిని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకుందామా అనే. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటానికి, లేదా వారి వారి పదవుల్ని కాపాడుకోవటానికే. ఉదయం, సాయంత్రం దేశరాజధాని తిరిగేది ప్రజాసమస్యలపై కాదు. వారు అక్కడనుండి ఒక్క పధకం గాని, ఒక్క పైసాగాని ప్రజలకోసం తెచ్చింది లేదు.
రాష్ట్ర ప్రజలకు ఆ ఆశకూడా లేదు. కాని మంత్రుల ఆవినీతి ఆరోపణలకు న్యాయ సహాయం పేరిట ప్రజల డబ్బుని అంతగా దుర్వినియోగపరచడానికా మనం ఎన్నుకున్నది.....దేశంలో నాలుగో పెద్దరాష్ట్రం. అధిక జనాభాలో ఐదవ రాష్ట్రం. అన్నిటికంటె ముందు భారత దేశానికి ఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణ. దేశంలో అత్యధిక వరి పండిరచే రాష్ట్రం. ఇదంతా గతం ....ఇక ముందంతా అంధకార రాష్ట్రంగానో లేదా అవినీతి ప్రభుత్వ రాష్ట్రంగానో మనంల్ని మనం పరిచయం చేసుకుందాం. ఇలాంటి నేతల్ని ఎన్నుకుంటే అంతే మరి.......


