కేసీఆర్‌కు హైకోర్టు షాక్.. వీసీల నియామకం రద్దు..

తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు 9 మంది వైస్ ఛాన్స్‌లర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది. అర్హతల ఆధారంగా నియామకాలు జరపాలని సీజే ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పింది. నియామకానికి సంబంధించి అర్హతలు, నిబంధనలు ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవోను కూడా నిలిపివేసింది. ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి వైస్-ఛాన్సలర్లుగా అవకాశం కల్పించేలా ప్రస్తుత జీవో ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పు అమలను నాలుగు వారాల పాటు రిజర్వ్‌లో పెట్టింది.