గెస్ట్‌హౌజ్‌లో గబ్బు గబ్బు.. అధికారుల బరితెగింపు..
Published on: Thu Mar 17, 2022 11:02AM
సంక్రాంతికి గుడివాడలో కేసినో నడిపించారు. మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌లోనే మందు, చిందు, జూదం నడిపారు. మంత్రిగారే అలా చేస్తే.. తామేమన్నా తక్కువా? అనుకున్నారేమో.. లేదంటే తమనెవరు అడుగుతారనే ధైర్యమో.. నూజివీడులో ప్రభుత్వ అధికారులు రెచ్చిపోయారు. గుడివాడ కేసినో టైప్‌లో.. ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌ను విందు, వినోదాలకు అడ్డగోలుగా వాడేసుకున్నారు. ఆ విషయం బయటకు రావడంతో.. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ పాలనలో మంత్రులు, అధికారులు ఇలా రెచ్చిపోతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌ను ఉన్నతాధికారులు మద్యం సేవించి, చిందులు వేసేందుకు వినియోగిస్తున్న వైనం కెమెరా కంటికి చిక్కింది. కృష్ణాజిల్లా నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయం విశ్రాంతి భవనంలో కొన్ని రోజులుగా ఈ తతంగం నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు డివిజనల్ పంచాయతీరాజ్ ఎగ్జికూటివ్ ఇంజనీర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఈఈ వినియోగిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో పంచాయతీరాజ్ ఈఈ బాపిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ ఈఈ సదాశివరావు మద్యం సేవిస్తున్నారు.
పైస్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీకి వచ్చినప్పుడు వారు బసచేసేందుకు అతిథి గృహంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాన్ని విలాస భవనంగా మార్చి ప్రభుత్వ అధికారులు మత్తులో జోగుతున్నవైనం బట్టబయలైంది. నూజివీడు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి,ఇరిగేషన్ శాఖల అతిథి బంగ్లాలను ఉన్నతాధికారులు పేకాట, మద్యపానం, వ్యభిచార నిలయాలుగా మార్చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


