TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్ళీ పోరు..ప్రభుత్వానికి హెచ్చరిక

Published on: Wed Feb 8, 2012 9:24AM

హైదరాబాద్: సకల జన సమ్మె విరమణ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాసకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా మళ్లీ ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస స్టీరింగ్ కమిటీ హెచ్చరించింది. మార్చి 19వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి, అప్పటికీ ప్రభుత్వం హామీలు నెరవేర్చని పక్షంలో 20న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఐకాస చైర్మన్ కె స్వామిగౌడ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస మంగళవారం టిఎన్‌జివో భవన్‌లో స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశమై ఆందోళన కార్యచరణ ప్రకటించింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు విఠల్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దేవిప్రసాద్ తదితరులు హాజరై ఐకాస ప్రకటించిన ఆందోళన కార్యాచరణకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ అంశంపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు అందించనున్నట్టు టిఇజెఎసి చైర్మన్ స్వామిగౌడ్ మీడియాకు వెల్లడించారు. ఈనెల 21న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, 25న జిల్లాలో ర్యాలీలు, మార్చి 3న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 5 నుంచి వర్క్ టు రూల్‌తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికీ సర్కారు దిగిరాని పక్షంలో మార్చి 20న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకపోగా, సకల జన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జన సమ్మె జరిగిన 42 రోజుల పని దినాలను రెగ్యులరైజ్ చేయకుండా తమను ప్రభుత్వం బెదిరించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగుల హక్కులను హరిస్తే తమనుంచి ప్రతిఘటన కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడనుందన్న హామీతో సకల జన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నాక మోసం చేసారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.