TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ సమన్వయకమిటి 'ఒకే ఒక్కడు'గా కిరణ్

Published on: Fri Dec 23, 2011 8:30AM

న్యూఢిల్లీ: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అగాథాన్ని పూడ్చేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య లోపిస్తున్న సమన్వయం వల్ల అంతిమంగా కాంగ్రెస్ దెబ్బతింటున్నట్లు అధిష్ఠానం ఆందోళనతో పిసిసి- ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఓ కమిటీని నియమించింది.అయితే వివిధ కారణాల వల్ల ఈ అంశాన్ని అధిష్ఠానం వాయిదా వేస్తూ వచ్చింది. కాగా  ఇటీవల కిరణ్, బొత్స పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఇక జాప్యం చేయడం ఏమాత్రం మంచిది కాదనే స్థిరాభిప్రాయానికి వచ్చింది.దాంతో గురువారం ఈ కమిటీని ప్రకటించేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ను పిలిచి చర్చించారు.అనంతరం  కమిటీ ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్‌ తరపున కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి జానారెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీ కెవిపి రామచంద్రరావుకుగాని కమిటీలో చోటు కల్పించకపోవడం గమనార్హం. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముగ్గురు నేతలకు కమిటీలో స్థానం కల్పించారు.

ప్రస్తుత కమిటీలో తెలంగాణకు పెద్ద పీట వేశారు. సీఎం కిరణ్, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా బొత్స, కావూరి కోస్తా ప్రాంతానికి చెందిన వారు. ఇక కమిటీలోని దామోదర రాజనరసింహ, డీఎస్, షబ్బీర్ అలీ తెలంగాణ నేతలు. ప్రాంతాల సంగతి పక్కనపెడితే కమిటీలో కిరణ్ వర్గీయులెవరికీ చోటు దక్కక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పైగా బొత్స, చిరంజీవి, డీఎస్ ముగ్గురూ కొన్ని రోజులోగా 'సమన్వయం'తో పని చేస్తున్న నేతలే. బహుశా ముఖ్యమంత్రి దూకుడుకు కళ్లెం వేసేందుకే అధిష్ఠానం వీరిని కమిటీలో చేర్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. పైగా  బొత్స, చిరంజీవి, డీఎస్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని కాంగ్రెస్‌లోని కొందరు గుర్తు చేస్తున్నారు. రెడ్డి వర్గం ప్రాధాన్యం తగ్గిందని కూడా వీరు చెబుతున్నారు. కమిటీలో మహిళలకు కూడా స్థానం కల్పించ కపోవడం సరైంది కాదన్నారు. అయితే.. మహిళా నేతను కమిటీలో త్వరలో నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నిజానికి శాఖల కేటాయింపుపై పలువురు సీనియర్ మం త్రులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం అటకెక్కిందని అధిష్ఠానం గ్రహించింది. అయితే కిరణ్‌కు బాధ్యతలు అప్పగించిన కొత్తలోనే సీనియర్ మంత్రుల అభిప్రాయాలకు తలొగ్గితే  పాలనపై సీఎంకు పట్టు తప్పుతుందని గ్రహించింది.

త్వరలోనే మంత్రివర్గంలో మార్పులూ ఉంటాయని అభయం ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో మార్పులకు అవకాశం లభించలేదు. ఇప్పుడు లోక్‌పాల్‌పై ఒక ఘట్టం ముగియగానే సమన్వయ కమిటీపై నిర్ణయం వెలువడింది. మరోవైపు... సమన్వయ కమిటీలో చిరుకి చోటిచ్చిన అధిష్ఠానం, రాష్ట్ర కేబినెట్‌లోనూ పీఆర్పీకి చోటిచ్చేలా విస్తరణ జరిగే అవకాశముందని తెలుస్తోంది. 'పీఆర్పీ సభ్యులను చేర్చుకోవడం ఖాయం. కానీ ఎప్పుడో చెప్పలేం' అని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.