మోదీతో తమిళిసై భేటీ.. కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్!?
Published on: Wed Apr 6, 2022 12:02PM
సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు పడుతున్నారు. మూడు రోజులుగా ఎంత ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. కలిసేదేలే అంటూ కేసీఆర్‌కు టైమ్ ఇచ్చేందుకు మోదీ ససేమిరా అంటున్నారు. కేసీఆర్‌కు ఇంకా బాగా తెలిసొచ్చేలా.. ఆయన్ను కావాలనే దూరం పెడుతున్నట్టు ఇండికేషన్ ఇచ్చేలా.. వరుస భేటీలు జరుగుతుండటం మరింత ఆసక్తికరం. మంగళవారం సీఎం జగన్ మోదీతో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రెండు రోజులుగా అడుగుతున్నా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా.. జగన్‌కు మాత్రం అడిగిన వెంటనే టైమ్ ఇవ్వడం.. పైగా గంట పాటు చర్చలు జరపడం ఇంట్రెస్టింగ్ పాయింట్. అక్కడితో అయిపోలేదు మోదీ స్ట్రాటజీ. బుధవారం ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కాదని.. గవర్నర్‌తో చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. ప్రోటోకాల్ వివాదంపై ప్రధానికి గవర్నర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తన ప్రసంగం లేకుండానే.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల అంశాన్ని తమిళిసై ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
గవర్నర్ తమిళిసైతో పీఎం మోదీ సమావేశమవడం.. అది కూడా కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే జరగడం ఆసక్తికరం. బెంగాల్‌లో మారిదే తెలంగాణలోనూ కేంద్ర యాక్షన్ ఉండబోతోందనే చర్చ ఇప్పటికే నడుస్తోంది. గతంలో బెంగాల్‌లో ప్రోటోకాల్ పాటించనందుకు ఆ రాష్ట్ర సీఎస్‌ను రీకాల్ చేసింది కేంద్రం. తెలంగాణ గవర్నర్ విషయంలో పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలానే వదిలేస్తే పరిస్థితి మరింత చేజారిపోతుందని.. అందుకే కేంద్రం తరఫున తగు చర్యలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఆ విషయాలపై చర్చించేందుకే.. గవర్నర్‌ను ఢిల్లీ పిలిపించి.. తమిళిసై నుంచి పీఎం మోదీ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర తరఫున తెలంగాణపై సీరియస్ యాక్షన్ ఉండబోతోందని ఢిల్లీ వర్గాల సమాచారం.
ప్రధానితో భేటీ తర్వాత గవర్నర్ మీడియాతో మాట్లాడారు. సీఎస్‌కు ప్రొటోకాల్ తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదంటూనే.. సర్కారుపై పలు ఆరోపణలు చేశారు గవర్నర్.
రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని తమిళిసై అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక పేరుని సేవారంగం నుంచి తనకు ప్రతిపాదించిందని.. ఆ వ్యక్తి ఎలాంటి సేవా చేయలేదని తాను భావించానన్నారు. తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని తెలిపారు. ప్రొ టోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ప్రొటోకాల్ తెలియదా? అని గవర్నర్ ప్రశ్నించారు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు ఎప్పుడైనా రావొచ్చని తమిళిసై చెప్పారు. ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. తనను ఎవరూ అవమానించలేదని.. తనకెంలాంటి ఇగోలు లేవని వ్యాఖ్యానించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానందున.. వివాదాలను కోరుకోవట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధాని మోదీని కలవలేదని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలనేదే తన ఉద్దేశమన్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రధాని దిశానిర్దేశం చేశారని గవర్నర్ తమిళిసై చెప్పారు.


