నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణ
Published on: Wed Nov 9, 2022 5:04PM
తెలంగాణ గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇందు కోసం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడ్డారని విమర్శించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా రాజ్ భవన్ ను ఫామ్ హౌస్ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో రాజ్ భవన్ లో ఏడీసీగా పని చేసిన తుషార్ పేరునుఫామ్ హౌస్ కేసులో ఉద్దేశపూర్వకంగా తీసుకు వచ్చారని తమిళిసై అన్నారు. ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.
తన వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్న విషయాన్నీ ఆమె ప్రస్తావించారు. ఔను నిజమే ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు రాజ్ భవన్ కు వచ్చాయనీ, ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కానీ ఈ లోపే దుష్ప్రచారం మొదలెట్టేశారని గవర్నర్ తమిళి సై అన్నారు. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ కోరానన్నారు. అయితే దానికీ వక్రభాష్యం చెప్పారని, తాను బిల్లులను అడ్డుకుంటున్నట్లుగా దుష్ప్రచారం చేశారని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని తెలిపారు.
కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధన్యత ఇచ్చానని పేర్కొన్నారు. అసలు కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డు ఎందుకు?. కొత్త రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?.. అది యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?.. లీగల్‌గా ఇబ్బందులు వస్తే ఏం చేస్తారు? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు?.. వంటి వివరాలు కావాలని అడిగినా ప్రభుత్వం నుంచి కానీ, సంబంధిత మంత్రి నుంచి కానీ సమాధానం రాలేదని తమిళిసై అన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాజ్ భవన్, ప్రగతి భవన్ సంబంధాలు మరో సారి భగ్గుమన్నాయి. తమిళిసై ప్రెస్ మీట్ తో దుమారం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల బిల్లు విషయంలో తాజా వివాదం ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య అగాధం మరింత పెరిగినట్లేనని అంటున్నారు.
ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


