TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గొట్టి ముక్కల పద్మారావు కన్నుమూత

Published on: Sun Jun 21, 2026 11:39AM

 

ప్రముఖ సినీ నిర్మాత,  రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1954 నవంబర్‌ 8న జన్మించిన పద్మారావు చిన్ననాటి నుంచే సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అనంతరం పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1985లో సుమన్ హీరోగా తెరకెక్కిన ‘కంచు కవచం’ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, అందులో పోలీసు పాత్రలో కూడా నటించారు. 1986లో సి.ఎస్. రావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ వేమన చరిత్ర’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

1991లో వంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా రూపొందిన ‘ఏప్రిల్ 1 విడుదల’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అనంతరం 1996లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘జోకర్’ చిత్రాన్ని నిర్మించారు. 2006లో విడుదలైన ‘నీ నవ్వే చాలు’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. పద్మారావుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె సుజనా రావు ‘గమనం’ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

రాజకీయ ప్రస్థానం

సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ పద్మారావు చురుకైన పాత్ర పోషించారు. 1970లలో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.

1996లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో జన్మభూమి కాలనీల ఏర్పాటు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2014లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా, సినీ నిర్మాతగా, సామాజిక సేవకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన గొట్టిముక్కల పద్మారావు మరణం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.