క‌రోనాకు గోమూత్ర చికిత్స‌.. గోశాలలో కొవిడ్‌కేర్‌ సెంటర్‌

గోవు. స‌ర్వ జ‌గ‌ద్ర‌క్ష. ఆవుకు హిందూధ‌ర్మంలో అధిక ప్రాధాన్యం ఉంది. గో మూత్రానికి అనేక రుగ్మ‌త‌ల‌ను హ‌రించే శ‌క్తి ఉంద‌ని అంటారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి సైతం గో మూత్రంతో చికిత్స చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు గుజ‌రాత్‌లోని కొంద‌రు ఔత్సాహికులు. అక్క‌డి ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. క‌రోనా బాధితులకు గోమూత్రంతో తయారు చేసిన మాత్రలను అందిస్తున్నారు. 

కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో గ్రామాల్లోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని గుజరాత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బనస్కాంత జిల్లాలోని టేతోడా గ్రామంలోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానికి ‘వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద్‌ కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌’గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి దేశీ ఆవు మూత్రం, పాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్‌ మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి అలోపతి మందులు కూడా అందిస్తున్నారు.  

‘స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఏడుగురు చికిత్స పొందుతున్నారు. గోవు పాలు, మూత్రం, నెయ్యితో తయారు చేసిన ఎనిమిది రకాల ఆయుర్వేద మందులను వారికి  అందిస్తున్నాం.’ అని గోశాల నిర్వాహకులు తెలిపారు. 

దగ్గును తగ్గించేందుకు గో మూత్రంతో తయారు చేసిన ‘గో తీర్థ’ అనే మందును ఇస్తున్నారు. వైర‌స్ బారిన ప‌డిన‌ బాధితుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు ఆవు పాలతో తయారు చేసిన ‘చవన్‌ప్రాశ్‌’ను అందిస్తున్నారు. గోశాల‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌లో రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు ఆయుర్వేద వైద్యలు, మరో ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు బాధితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితోనే నిర్వాహకులు గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పటేల్‌ వెల్లడించారు. అయితే, క‌రోనా సోకిన తొలినాళ్ల‌లో, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ గోశాల‌లో చికిత్స‌. కొవిడ్ ముదిరితే.. హాస్పిట‌ల్‌కి వెళ్లాల్సిందే అంటున్నారు.