హౌస్ ఫెడ్ ఛైర్మన్ గోపాల్ రెడ్డికి పదవీగండం?
Published on: Mon Feb 20, 2012 1:49PM
చిత్తూ
రుజిల్లా: రాష్ట్ర సహకార గృహనిర్మాణాల సంస్థల సమాఖ్య ఛైర్మన్ గోపాల్ రెడ్డికి పదవీగండం ఏర్పడింది. చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ సహకార గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ గా ఉన్న గోపాలరెడ్డిని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి హౌస్ ఫెడ్ ఛైర్మన్ గా నియమించారు. అయితే గోపాలరెడ్డి వ్యవహారాల తీరుపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ సహకార గృహనిర్మాణ సంఘానికి చెందిన ఐదుగురు పాలక మండల డైరెక్టర్లు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. గుర్రంకొండ సహకార గృహనిర్మాణ సంఘం పాలకమండలిలో మెజారిటీ డైరెక్టర్లు రాజీనామా చేయడంతో వీటిని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఏదైనా సహకార గృహనిర్మాణ సంఘానికి ఛైర్మన్ గా ఉన్న వ్యక్తే హౌస్ ఫెడ్ ఛైర్మన్ అవుతారు. ఐదుగురు డైరెక్టర్ల రాజీమానాలతో గుర్రంకొండ సహకార గృహనిర్మాణ సంఘం పాలకమండలి రద్దు అయితే ఛైర్మన్ గోపాల్ రెడ్డి పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే జరిగితే ఆయన రాష్ట్ర హౌస్ ఫెడ్ ఛైర్మన్ పదవిని కూడా కోల్పోక తప్పదు.


