ఐటీ హబ్గా విశాఖ... గూగుల్..
Published on: Fri Sep 26, 2014 10:05AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాడే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తన లక్ష్య సాధనలో భాగంగా ఆయన అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు విశాఖపట్నంలో తమ బ్రాంచ్లను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ స్థాయి పెద్ద సంస్థలతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ కూడా విశాఖపట్టణానికి వచ్చేలా చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29న చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటీ కంపెనీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులు వస్తున్నారని తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత గూగుల్ సంస్థ విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా గూగుల్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా కుదరనుందని సమాచారం.


