అసంపూర్తిగా ముగిసిన జీఓయం భేటీ



కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై ఈరోజు సుదీర్ఘమయిన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి, ఇటీవల ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్, జలవనరులు, విద్యుత్, ఆర్ధిక, పరిపాలనా శాఖల అధికారులతో కూడా ఆయా అంశాలపై లోతుగా చర్చించింది. రేపు కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఉన్న కారణంగా ఈరోజు సమావేశంలోనే తన తుది నివేదిక తయారు చేయాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ అది వీలుకాలేదని షిండే మాటల ద్వారా అర్ధం అవుతోంది. రేపటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తమ తుది నివేదికను సమర్పించడం సాధ్యం కాదన్నట్లు ఆయన మాట్లాడారు. మళ్ళీ రేపు మరో మారు సమావేశమవుతామని కూడా తెలిపారు. అయితే జలవనరులు, ఉద్యోగాలు, ఆర్టికల్ 371 (డీ) వంటి కొన్ని అంశాలపై తుది నిర్ణయం అయినట్లు సమాచారం. కానీ హైదరాబాద్ అంశంపై ఇంకా చిక్కుముడి అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః రేపటి సమావేశంలో దానిపై కూడా ఒక స్పష్టత రావచ్చునేమో! రాష్ట్ర విభజనపై లోతుగా చర్చిస్తున్నకొద్దీ అది ఎంత క్లిష్టమయినధో కేంద్ర మంత్రుల బృందానికి కూడా ఇప్పుడు అర్ధం అవుతోంది. నిజానికి ఈ ప్రక్రియకు ఎంత సమయం అవసరమో కూడా బహుశః వారికి ఈపాటికే అర్ధం అయి ఉండవచ్చు. అయితే ఇది స్వయంకృతాపరాదమే గనుక ఇప్పుడు ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు.