కేంద్రమంత్రుల బృందం వేస్తే అదో తుత్తి!

 

రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయినప్పుడు కాంగ్రెస్ హడావుడిగా అంటోనీ కమిటీ వేసింది. దాని నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందం రాష్ట్రంతో కానీ, రాష్ట్ర ప్రజలతో గానీ ఎటువంటి సంబంధం లేకుండా డిల్లీలోనే కూర్చొని విభజన ప్రక్రియ చకచక చేసుకుపోతుంటే, సీమాంధ్ర రాజకీయ పార్టీలు మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో అఖిలపక్ష సమావేశం పెట్టింది. అయినప్పటికీ విభజన రాజ్యంగా ప్రకారం జరుగలేదంటూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతుండటంతో చివరిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా నిన్న పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని ‘మమ’ అనిపించేసింది.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశామని, అందుకోసం తమ పదవులకు రాజీనామాలు కూడా చేసేసామని చెప్పుకొంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మళ్ళీ తమ కేంద్రమంత్రుల హోదాలోనే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్రమంత్రుల బృందానికి తగిన సూచనలు ఇచ్చివచ్చారు.

 

కానీ, ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనే చెప్పివచ్చామని మరో మారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. బహుశః ఏపీఎన్జీజీవోల హెచ్చరికలు, ప్రజల ఆగ్రహానికి గురికాకూడదనే భయమే వారిని ఆవిధంగా పలికించి ఉంటుంది. లేకుంటే వారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి ఈ సందర్భంగా మీడియా ముందు ప్రస్తావించేవారే కాదు. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా చాలా వాదించానని, తను కూడా అవసరమయితే వారిలాగే పదవీ త్యాగానికి సిద్దమని చెప్పి వచ్చారు.

 

కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సిద్దం చేసి ఈ నెల 21న క్యాబినెట్ కి సమర్పించనుంది. కానీ, ఈ అభిప్రాయ సేకరణ తంతు పూర్తయిన కొద్ది గంటలలోనే రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడు-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనను ముందే ఖరారు చేసేస్తూ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిని బట్టి ఈ కేంద్రమంత్రుల బృందం, అబిప్రాయాల సేకరణ తంతు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని అర్ధం అవుతోంది.

 

కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు శాఖల వారిగా తెరవెనుక ఈ విభజన ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంటే, ప్రజల తుత్తి కోసమే కేంద్రమంత్రుల బృందం పాపం! చాలా శ్రమ తీసుకొంది. కానీ నేటికీ కొందరు విభజనను వ్యతిరేఖిస్తూ చెప్పివచ్చమని, మరి కొందరు అడ్డుకొంటామని చెప్పడం కూడా సీమాంధ్ర ప్రజల తుత్తి కోసమే!