అలలపై తేలియాడుతూ కొట్టుకొచ్చిన బంగారు రథం
Published on: Wed May 11, 2022 1:01PM
ఆంధ్రప్రదేశ్ లో ‘అసని’ తుపాను ఒక వైపున అలజడి రేపుతోంది. అనేక చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. అసని తుపాను సమయంలోనే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తీరం ఓ వింత సంఘటనకు వేదిక అయింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు సమీపానికి బంగారు రథం లాంటి ఓ మందిరం కొట్టుకు వచ్చింది. ఆ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. ఈ బంగారు రథం మలేషియా, థాయిలాండ్, జపానుల్లోని ఏదో ఒక దేశానికి చెందినదై ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు.
గతంలో ఉత్తరాంధ్రను మరీ ముఖ్యంగా సుందర నగరం విశాఖను అతలాకుతలం చేసిన తిత్లీ లాంటి పెను తుపాను సంభవించినప్పుడు కూడా ఇలాంటివేవీ కొట్టుకురాలేదని మత్స్యకారులు చెప్పారు. ఈ బంగానే రథం తమ ప్రాంతంలోని తీరానికి కొట్టుకు రావడంతో సంతబొమ్మాళి మండల వాసులు వింత అనుభూతి చెందుతున్నారు.
బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్థానికులు చెప్పారు. రథం లాంటి ఈ మందిరం ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో తేలాల్సి ఉంది.


