TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

Published on: Wed May 13, 2026 2:45PM

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో, విదేశీ మారక నిల్వలను  కాపాడుకోవడానికి ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోడి తాజాగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని ఆ పిలుపునిచ్చిన రోజుల వ్యవధిలోనే దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర దాదాపు రూ.14 వేల మేర పెరగ్గా వెండి ధర రూ.20 వేల మేర ఎగబాకడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం (మే 13) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా రూ.1,67,890కు పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర ఏకంగా రూ.13,910ల మేర ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.12,750ల మేర పెరిగి రూ.1,53,900కు చేరింది. నగరంలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.20 వేల మేర పెరిగి రూ.3.10 లక్షలకు చేరుకుంది. రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో కరెంట్ అకౌంట్‌ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం తాజాగా బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతంపెంచిన విషయం తెలిసిందే. 

గతంలో ఇది 6 శాతంగా ఉండేది. కస్టమ్స్ డ్యూటీ పెంపుతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ధరలు అధికంగా ఉన్నందున కస్టమ్స్ డ్యూటీ పెంపుతో బంగారం, వెండికి డిమాండ్ తగ్గవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి దిగుమతుల కట్టడి కోసం ఇటీవల ప్రభుత్వం 3 శాతం ఐజీఎస్‌టీ విధించింది. దీంతో, బ్యాంకులు దిగుమతులకు దాదాపు నెల రోజుల పాటు బ్రేక్ చెప్పాయి. ఫలితంగా ఏప్రిల్‌లో దిగుమతులు 30 ఏళ్ల నాటి కనిష్ఠాన్ని తాకాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు దేశ ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోడీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.