భద్రాచలం వంతెన పై నుంచి వరద ప్రవాహం
Published on: Sat Jul 16, 2022 7:53AM
కుండపోత వర్షాలు, భారీ వరదలతో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. గోదారి తల్లిగా జనం పూజలందుకునే గోదావరి ఇప్పుడు జనాన్ని భయపెడుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 75 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వంతన పై నుంచి గోదావరి ప్రవహిస్తున్నది.
నదీ ప్రవాహ ఉధృతి చూసి స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు. భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా గోదావరే. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. గోదావరి వరద ఉధృతిని అంచనా వేసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా భద్రాచలం వంతెనపై నుంచి రాకపోకలను నిషేధించారు.
కాగా 36 ఏళ్ల కిందట భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. అప్పుడూ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ఆ తరువాత ఇన్నేళ్లకు మళ్లీ ఆ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్మీని రంగంలోనికి దింపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


