TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి విశ్వరూపం

Published on: Sat Jul 16, 2022 1:54AM

ఉగ్ర గోదావరి విశ్వ రూపం దాల్చింది. భద్రాచలం రామాలయాన్ని చుట్టుముట్టింది. వరద గోదారి భద్రాచలం పరిసర ప్రాంతాలను జలదిగ్బంధం చేసింది. భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరింది. అర్ధరాత్రి సమయానికి ఇది 75 అడుగులకు చేరు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.1986 తరువాత గోదావరికి ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటి సారి.

వరద ప్రవాహం 80 అడుగులకు చేరితే మొత్తం భద్రాచలం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. గోదావరి నీటి మట్టం 75 అడుగులకు చేరితే వంతెన పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది.   వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్మీ సహాయాన్ని కోరింది. 

సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.   భద్రాచలం వద్ద ఎంతటి భయానక పరిస్థితి నెలకొంటే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి దాదాపు 18 అడుగుల ఎత్తున గోదావరి ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.   ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ఫోన్ లో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే పువ్వాడతోనూ ఫోన్ లో మాట్లాడి భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.