ఆ 13మంది ఎక్కడ..? సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

గోదావరిలో ఆపరేషన్ వశిష్ట కొనసాగుతోంది. ఇంకా 13మంది కోసం ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గోదావరిని జల్లెడపడుతున్నాయి. అయితే, ఇప్పటివరకు మొత్తం 34 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉంటే, అందులో 65మంది పర్యాటకులు, 8మంది బోటు సిబ్బందిగా తేల్చారు. అయితే, బోటు నుంచి 26మంది ప్రాణాలతో బయటపడగా, మొత్తం 47మంది గల్లంతైనట్లు వివరాలు ఇఛ్చింది. అలాగే, ఇప్పటివరకు 34 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 13మంది ఆచూకీ లభించాల్సి ఉందని ప్రకటించింది. అయితే, వీళ్లంతా బోటులో ఇరుక్కుపోయి ఉంటారని ఎన్టీఆర్ఎఫ్ భావిస్తోంది. దాంతో బోటును బయటికి తీస్తేనే మృతదేహాలు బయటపడే అవకాశముందంటున్నారు.

మరోవైపు, 250 అడుగుల లోతులో బోటును ఎన్టీఆర్ఎఫ్ గుర్తించింది. ఉత్తరాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సోనార్ పరికరంతో... నదీగర్భంలో బోటును గుర్తించి ఫొటోను సైతం తీశారు. అయితే, నదీగర్భం నుంచి బోటును బయటికి తీయడం మాత్రం సాధ్యంకాదంటున్నారు. బోటు సుమారు 50 టన్నుల బరువు ఉండటం... పైగా 250 అడుగుల లోతులోకి కూరుకుపోవడంతో బయటికి తీయడం చాలా కష్టమని తేల్చేశారు. దాంతో బోటులో ఇరుకున్న మృతదేహాలు వాటంతటవి బయటికి వస్తేనేగానీ, ఇంకేమీ చేయలేమని రెస్క్యూ బృందాలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, బోటు ప్రమాదాన్ని జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.... ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, అధికార యంత్రాంగం వైపు వైఫల్యాలు, లోపాలపై వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ 60రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణాధికారిగా తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ ను నియమించింది.