TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖాళీ టైం విపరీతంగా వున్న ఇద్దరు ‘మేధావులు’ రాష్ట్రపతి అవుదామనుకున్నారు!

Published on: Sat Jul 1, 2017 11:56AM

 

చాలా మందికి ఎంతో అవసరమైన పనులు చేసుకుందామంటేనే ఓపిక, సమయం వుండవు! కాని, కొందరికీ ఏ ఉపయోగం లేని పనులు, వినటానికే విచిత్రంగా వుండే పనులు చేయటానికి ఎక్కడలేని టైం దొరుకుతుంది! అందుకు మంచి ఉదాహరణ ఈ మధ్య దాఖలైన రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లు చూస్తే దొరుకుతంది!

 

ప్రణబ్ తరువాత ఎవరు ప్రెసిడెంట్ అనేది తేల్చటానికి ప్రస్తుతం ఎన్నికలు జరగబోతుండటం తెలిసిందేగా! అయితే, మిగతా అన్ని ఎన్నికల్లాగే రాష్ట్రపతి ఎన్నికలకు కూడా అర్హత వున్న ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. కాని, వారికి కనీసం 50మంది ఎంపీల మద్దుతుండాలి! ఇలాంటి రూల్ వున్నా ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదుగాని … మొత్తం 90కి పైగా నామినేషన్లు వేశారట ప్రెసిడెంట్ అవుతామంటూ! చివరకు, అధికార ఎన్డీఏ కూటమి నిలిపిన రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ పోటీలో వుంచి మీరా కుమార్ మాత్రమే ఎన్నికలకు మిగిలారు. మిగతా అందరి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.

 

నామినేషన్ల తిరస్కరణ ఎప్పుడూ జరిగేదే. కాని, ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగిన ఒకాయన ఏకంగా తాను దేవుడ్నని హెచ్చరించి మరీ నామినేషన్ వేశాడు. అంతే కాదు, తనకు అద్బుత శక్తులున్నాయన్నాడు పానిపట్ ప్రాంతానికి చెందిన సదరు దేవీదయాళ్ అగర్వాల్! తనని ఎన్నుకోకుంటే దిల్లీలో భూకంపం వస్తుందని కూడా చెప్పాడట! మరో మేధావి తాను రాష్ట్రపతిని అయ్యేందుకు ఎవరెవరి మద్దతు తీసుకొచ్చాడో తెలుసా? భగత్ సింగ్ , వివేకానంద, అబ్రహాం లింకన్, ఐన్ స్టీన్… అబ్బో ఇలా చాలా మంది లెజెండ్స్ నే పట్టుకొచ్చాడు! ఆ మహానుభావులంతా హర్యానాకు చెందిన వినోద్ కుమార్ అనే ఓ ఔత్సాహిక రాష్ట్రపతికి తమ మద్దతు తెలిపారట! ఈ విషయం తన పేరుకు తగట్టుగా నామినేషన్ లో చెప్పాడు వినోద్ కుమార్!

 

ఇంతకీ నేను దేవుడ్ని అన్న పెద్దాయన నామినేషన్, నాకు భగత్ సింగ్ మద్దతుందన్న మేధావి నామినేషన్ ఏమయ్యాయనుకున్నారు? సింపుల్ గా రిజెక్ట్ అయ్యాయి! వీళ్ల ఈ వింత నామినేషన్ల గురించి వింటే ఏమనిపిస్తోంది? దేశంలో ఖాళీ టైం విపరీతంగా వున్న పాప్ కార్న్ బ్యాచ్ చాలా మంది వున్నారనిపిస్తోంది కదూ!