కాంగ్రెస్ కు తలంటిన సుప్రీం..
Published on: Tue Mar 14, 2017 12:56PM

ఇప్పటికే గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తో కూడా రాజీనామా చేయించారు. అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ వ్యవహారం. గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్సే ఎక్కువ సీట్లు గెలిచింది. అయితే కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూర్చోవడంతో.. రంగంలోకి దిగిన బీజేపీ రాత్రికి, రాత్రే కాంగ్రెస్ భవిష్యత్తునే మార్చేసింది. మిగిలిన పార్టీ నేతలతో చర్చలు జరిపి వారి మద్దతును కూడగట్టుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మృదులా సిన్హా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ.. 15 రోజుల తరువాత బలనిరూపణ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మనోహర్ పారికర్ గోవా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇంత జరిగిన తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భాజపా పార్టీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా నిలువరిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. అయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే తగిలింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు..కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను ఎందుకు కోరలేదని ప్రశ్నించింది. అంకెలు అతిపెద్ద పార్టీని సూచిస్తాయని.. అసలు మీ పార్టీకి మద్దతు ఇస్తున్న సభ్యుల సంఖ్య ఎంత? వారి పేర్లేమిటో తెలియజేయాలని సూచించింది.


