కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవబోతున్నారా

 

రెండు మూడు రోజుల క్రితం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. మనోహర్ బీజేపీ ప్రచార కమిటీలో ముఖ్య సభ్యుడు. అంతే గాక పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మరియు బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి సన్నిహితుడు.

 

ఒక బీజేపీ ముఖ్య నేత కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రస్తుత పరిస్థితుల్లో రహస్యంగా వచ్చికలవడం చాలా ఆశ్చర్యంకలిగిస్తోంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుకి బీజేపీ మద్దతు తీసుకొంటూనే మళ్ళీ అదే పార్టీని తెలంగాణాలో దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని స్పష్టం అయ్యింది. ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదన కూడా అందుకేనని అర్ధం అవుతోంది. మరి అటువంటప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అది తన కాళ్ళను తనే నరుకోవడం అవుతుంది. గనుక, బీజేపీ కూడా బహుశః కాంగ్రెస్ పద్దతిలోనే ఆలోచించి, కాంగ్రెస్ అధిష్టానాన్నిఎదురిస్తూ సమైక్య ఛాంపియన్ గా అవతరించి, త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడతారనుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండవచ్చును.

 

ఇంత రాద్దాంతం చేసిన తరువాత ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగే అవకాశాలు లేవు. అలాగని తనంతట తాను పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడమూ కష్టమే. గనుక, ఎటువంటి మరకలు లేకుండా సమైక్య చాంపియన్ గా అవతరించిన ఆయనకి సీమాంధ్రలో చాలా బలహీనంగా ఉన్న బీజేపీ శాఖ పగ్గాలు అప్పగిస్తే అటు బీజేపీ, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా పూర్తి ప్రయోజనం పొందగలుగుతారనిబీజేపీఆలోచనఅయ్యిఉండవచ్చును.

 

రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా కనబడటం లేదు గనుక, కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకొని ఇబ్బందులు పడే బదులు, సీమంధ్రలో బీజేపీ పగ్గాలు అందుకొంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రాష్ట్రాన్నిఅసలు విభజించాలా వద్దా? విభజిస్తే ఏవిధంగా విభజించాలి? వంటివి విషయాలలో ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారుతారు.

 

ఒకవేళ ఆయన అద్వర్యంలో సీమాంధ్రలో బీజేపీ గనుక గెలిస్తే ఆయన మళ్ళీ రాష్ట్ర లేదా సీమాంధ్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పార్టీ ఓడిపోయినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్కడ కేంద్రమంత్రిగా సెటిల్ అయిపోవచ్చును.

 

మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వ్రేలాడే బదులు, తమతో చేతులు కలిపితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ బీజేపీ తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి హామీ ఇచ్చి ఉండవచ్చును. లేకుంటే వారిరువురూ రహస్యంగా ముచ్చటించుకోవలసిన సమయం, సందర్బము రెండూ కావు. వారి రహస్య సమావేశానికి ఇంతకంటే ప్రత్యేక కారణాలు కూడా వేరే ఏమి కనబడటం లేదు.

 

ఒకవేళ కిరణ్ బీజేపీ కమలం పట్టుకొనేందుకు సిద్దం అయితే రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయి.