TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి విషయంలో అమ్మాయి మౌనం సంపూర్ణ అంగీకారమే.. తాలిబన్ల ఆటవిక చట్టం!

Published on: Tue May 19, 2026 5:53AM

అఫ్గానిస్థాన్‌లో మహిళల హక్కులను పూర్తిగా కాలరాస్తూ తాలిబన్ల ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సమాజంలో స్త్రీల స్వేచ్ఛను అణచివేసే క్రమంలో ఇప్పటికే ఎన్నో కఠిన నిబంధనలు తెచ్చిన తాలిబన్లు, ఇప్పుడు నేరుగా వారి వివాహ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ఫ్యామిలీ లా డిక్రీని తీసుకువచ్చారు.  ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్  (భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు) పేరుతో రూపొందించిన ఈ కొత్త చట్టంలో పొందుపరిచిన నియమాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహజ్వాలలకు కారణమవుతున్నాయి. మొత్తం 31  నిబంధనలు  ఉన్న ఈ సుదీర్ఘ చట్ట పత్రాన్ని తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించారు. ఈ చట్టంలో ఉన్న అత్యంత వివాదాస్పదమైన నిబంధన ఏమిటంటే, ఒక మైనర్ లేదా యుక్తవయస్సుకు వచ్చిన  అమ్మాయి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మౌనంగా ఉంటే, ఆ మౌనాన్ని ఆమె పెళ్లికి తెలిపిన చట్టబద్ధమైన అంగీకారంగానే  భావించాల్సి ఉంటుంది.

సాధారణంగా భయాందోళనల వల్లనో,  సంకోచం వల్లనో నోరు విప్పలేని  బాలికల మౌనాన్ని ఆసరాగా చేసుకుని, బలవంతపు వివాహాలను చట్టబద్ధం చేయడానికే ఈ మార్పులు తెచ్చారని హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే, ఇదే చట్టంలో అబ్బాయిలకు లేదా ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రం ఈ మౌన నియమం వర్తించదని పేర్కొనడం గమనార్హం. అంటే ఒక అబ్బాయి మౌనంగా ఉంటే అది అంగీకారం కాదు, కేవలం పెళ్లికాని యువతుల మౌనమే అంగీకారంగా మారుతుంది. ఈ వివక్షాపూరిత విధానం అఫ్గాన్ సమాజంలో లింగ వివక్షను మరింత పెంచుతోందని ఐక్యరాజ్యసమితి  ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఒక క్రమబద్ధమైన "జెండర్ అపార్తీడ్" (లింగ వర్ణవివక్ష) గా ఐరాస అభివర్ణించింది.

ఈ  డిక్రీ ప్రకారం..  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మైనర్లకు  కూడా వివాహాలు జరిపించడానికి అనుమతులు ఇచ్చారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే విధంగా తండ్రికి, తాతకు ఈ పెళ్లిళ్లపై సర్వాధికారాలు కట్టబెట్టారు. వరుడు సామాజికంగా అర్హుడై ఉండి, ఇస్లామిక్ నిబంధనల ప్రకారం కట్నకానుకలు   చెల్లిస్తే మైనర్ల వివాహాలు కూడా చట్టబద్ధంగా చెల్లుతాయని స్పష్టం చేశారు. అయితే..  బాల్యదశలో జరిగిన పెళ్లిని సదరు బాలిక లేదా బాలుడు యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత రద్దు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ,   ఆ వివాహాన్ని రద్దు చేయాలంటే కచ్చితం షరియా కోర్టుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీవ్రమైన పురుషాధిక్యత కలిగిన తాలిబన్ కోర్టుల్లో మహిళలకు న్యాయం జరగడం దాదాపు అసాధ్యమని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు.

గతంలో 2024 ఆగస్టులో మహిళల గొంతు వినబడకూడదని, వారు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకూడదని, ముఖాలు కూడా పూర్తిగా మూసి ఉంచాలని తాలిబన్లు ఆంక్షలు విధించారు. ఇప్పుడు మరో  అడుగు ముందుకు వేసి, అమ్మాయిలు భయంతో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే పెళ్లి చేసేసే హక్కును పురుషులకు కల్పించారు. బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు చట్టబద్ధం కావడం వల్ల చిన్న వయసులోనే అమ్మాయిల జీవితాలు ఛిద్రమవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న ఈ అరాచకాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి తాలిబన్ల నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.